సాధారణంగా చేతి బోరు సహాయంతో లోతున ఉన్న నీళ్లు బయటకు వస్తూ ఉంటాయి. గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ ఇది సర్వ సాధారణం. కానీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ చేతిబోరును వాడితే నీరు కాకుండా మద్యం వస్తోంది. గుణ జిల్లాలోని భన్‌పురా గ్రామంలో పోలీసులు అక్రమ మద్యం సరఫరా, తయారీ చేస్తున్న ముఠాను స్వాధీనం చేసుకున్నారు. భారీగా స్టాక్‌ను స్వాధీనం చేసుకుని.. చేతి పంపు ద్వారా మద్యం బయటకు తీసినట్లు అధికారి బుధవారం తెలిపారు. పోలీసులు గ్రామంలో దాడి చేశారు. భూమిలోపల పాతిపెట్టిన మొత్తం ఎనిమిది డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నారు. "భూగర్భంలో దాచిన ముడి మద్యం డ్రమ్ములతో జతచేయబడిన హ్యాండ్ పంప్ కూడా అధికారుల బృందం స్వాధీనం చేసుకుంది. పోలీసు సిబ్బంది దానిని పంపింగ్ చేయడం ప్రారంభించినప్పుడు, మద్యం రావడం ప్రారంభమైంది" అని గుణ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పంకజ్ శ్రీవాస్తవ తెలిపారు. పొలాలలో పశుగ్రాసం కింద దాచిన డ్రమ్ములలో నిల్వ చేసిన భారీ మొత్తంలో దేశీ తయారీ మద్యాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.