77 ఏళ్ల మహిళ నుండి 1.2 కోట్లు ఎలా కొట్టేశారో తెలుసా?
బెంగళూరుకు చెందిన 77 ఏళ్ల మహిళ ఇటీవల ఆన్‌లైన్ స్కామ్
బెంగళూరుకు చెందిన 77 ఏళ్ల మహిళ ఇటీవల ఆన్‌లైన్ స్కామ్‌కు గురైంది. ఏకంగా రూ. 1.2 కోట్లు పోగొట్టుకుంది. లక్ష్మీ శివకుమార్ అనే మహిళకు టెలికాం డిపార్ట్‌మెంట్ అధికారిగా నటిస్తూ ఒకరి నుండి కాల్ వచ్చింది. మీ పేరుతో ఉన్న సిమ్ కార్డును ఉపయోగించి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరుగుతున్నాయని అవతలి వ్యక్తి ఆరోపించారు. దీనికి సంబంధించి ముంబై క్రైమ్ బ్రాంచ్‌లో ఫిర్యాదు చేశారని కాల్ చేసిన వ్యక్తి చెప్పాడు.
ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులుగా చెప్పుకునే వ్యక్తుల నుంచి వరుసగా మహిళకు కాల్స్ వచ్చాయి. ఆమెపై మనీలాండరింగ్ ఆరోపణలు గుప్పించారు. ఆమె బ్యాంకు ఖాతాలు, పెట్టుబడులకు సంబంధించిన వివరాలను అడిగారు. సరైన సమాచారం ఇవ్వకపోతే అరెస్టు చేస్తామని బెదిరించారు. మోసగాళ్లు నకిలీ ఎఫ్‌ఐఆర్, సుప్రీంకోర్టు అరెస్ట్ వారెంట్‌తో సహా నకిలీ పత్రాలను ఆమెకు పంపించడంతో భయపడి పోయింది. వెంటనే 1,28,70,000 రూపాయలు.. వారికి ట్రాన్స్ఫర్ చేసింది. విచారణ పూర్తయ్యాక డబ్బు తిరిగి ఇచ్చేస్తానని హామీ ఇచ్చారు. ఎంతసేపు ఎదురు చూసినా వారి నుండి స్పందన రాలేదు. వారిని సంప్రదించేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. మోసపోయానని గ్రహించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రతి రోజూ ఇలాంటి ఘటనలు దేశంలో నమోదవుతూనే ఉన్నాయి. అయితే ఇలాంటి వాటి పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తూ ఉన్నా కూడా ఎక్కడో ఒకచోట.. ఎవరో ఒకరు ఈ మోసాలకు బలవుతూ ఉన్నారు.