బిపిన్ రావత్ మంచినీళ్లు అడిగారు.. అవికూడా ఇవ్వలేకపోయాం - ప్రత్యక్ష సాక్షి
తమిళనాడులోని ఊటీ ప్రాంతంలో నిన్న జరిగిన ఘోర హెలికాఫ్టర్ ప్రమాదంలో భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మృతి చెందారు
తమిళనాడులోని ఊటీ ప్రాంతంలో నిన్న జరిగిన ఘోర హెలికాఫ్టర్ ప్రమాదంలో భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్, ఆయన సతీమణి తో పాటు 11 మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనతో యావత్ దేశం ఉలిక్కిపడింది. ప్రమాద సమయంలో హెలికాఫ్టర్ లో 14 మంది ఉండగా.. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన కూడా ఇప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా.. ఈ దుర్ఘటనను ప్రత్యక్షంగా చూసినవారు ఒళ్లు జలదరించే విషయాలను వెల్లడిస్తున్నారు.
ముగ్గురు కింద పడటాన్ని....
తాజాగా.. శివకుమార్ అనే ప్రత్యక్షసాక్షి చెప్పిన విషయం అందరినీ కలచివేసింది. అక్కడి టీ ఎస్టేట్ లో పనిచేస్తున్న తన సోదరుడిని కలిసేందుకు వెళ్లిన శివకుమార్.. ఆకాశంలో హెలికాఫ్టర్ మండిపోతూ పడిపోతుండటాన్ని గమనించాడు. వెంటనే కేకలు వేసి కొందరిని పిలువగా.. వారంతా ప్రమాద స్థలానికి చేరేలోపే.. ముగ్గురి శరీరాలు పడిపోవడాన్ని గమనించారు. వారిలో ప్రాణాలతో ఉన్న ఒకరిని బయటకు లాగగా.. అతను తాగేందుకు నీళ్లు అడినట్లు శివకుమార్ చెప్పారు.
తమ వద్ద లేకపోవడంతో....
ఆ తర్వాత రెస్క్యూటీమ్ ఆయనను బెడ్ షీట్ లో తీసుకెళ్లారు. కొంతసేపటికి ఎవరో చెబితే ఆయనే జనరల్ బిపిన్ రావత్ అని తమకు తెలిసిందని, దేశానికి ఎంతో సేవ చేసిన వ్యక్తి చివరకు నీళ్లు కావాలని తమను అడిగితే అవి కూడా ఇవ్వలేకపోయామని శివకుమార్ కంటతడి పెట్టుకున్నారు. నిజానికి ఆ సమయంలో తమవద్ద మంచినీళ్లు లేకపోవడంతో ఇవ్వలేకపోయామన్నారు. కానీ.. నిన్న రాత్రంతా తనకు నిద్ర పట్టలేదని, ఆయన మంచినీళ్లు అడగడమే తనకు పదే పదే గుర్తొచ్చిందన్నారు.