పెళ్లింట విషాదం.. రిసెప్షన్ జరుగుతుండగానే కుప్పకూలిన నవవధువు
రిసెప్షన్ మధ్యలోనే పెళ్లికూతురు చైత్ర ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను బెంగళూరులోని నిమ్హాన్స్
పెళ్లింట విషాదం నెలకొంది. దాంపత్య జీవితంలోకి ఆనందంగా అడుగుపెట్టాల్సిన నవ వధువు రిసెప్షన్ మధ్యలోనే కుప్పకూలిపోయింది. ఈ ఘటన కర్ణాటకలోని శ్రీనివాసపురంలో జరిగింది. కొలార్ జిల్లా శ్రీనివాసపురం తాలుకా కోడిచెరువుకు చెందిన రామప్ప కుమార్తె చైత్ర (26) కైవార కాలేజీలో లెక్చరర్ గా ఉద్యోగం చేస్తోంది. హోసకోటకు చెందిన యువకుడితో చైత్రకు పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 7వ తేదీన శ్రీనివాసపురంలో వివాహం జరగాల్సి ఉంది. వివాహానికి ముందు 6వ తేదీన ప్రీ రిసెప్షన్ నిర్వహించారు.
Also Read : అండర్ -19 ఆటగాళ్లకు కలిసొచ్చిన ఐపీఎల్ వేలం
ఏమైందో ఏమో తెలీదు గానీ.. రిసెప్షన్ మధ్యలోనే పెళ్లికూతురు చైత్ర ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను బెంగళూరులోని నిమ్హాన్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చైత్రకు వైద్యులు ఆరురోజులుగా చికిత్స చేస్తున్నారు. ఆఖరికి ఆమె బ్రెయిన్ డెడ్ అయిందని వైద్యులు చెప్పడంతో.. ఆ తల్లిదండ్రులు నిశ్చేష్టులయ్యారు. వైద్యుల విజ్ఞప్తి మేరకు చైత్ర అవయవాలను దానం చేసి, మానవత్వాన్ని చాటారు. పెళ్లితో కొత్త జీవితం ఆరంభించాల్సిన కూతురు.. అకస్మాత్తుగా చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.