ఢిల్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ రెండు గ్యారంటీలు
ఢిల్లీలో మూడు వందల యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తును అందచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు;
ఢిల్లీలో మూడు వందల యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తును అందచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి హామీలకు సంబంధించిన పోస్టర్లను రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఢిల్లీలో కూడా కాంగ్రెస్ ను గెలిపించాలని కోరుతున్నానని ఆయన తెలిపారు. దేశంలో అనిరుద్యోగం అతిపెద్ద సమస్యగా మారిందన్న రేవంత్ తాము తెలంగాణలో అధికారంలోకి రాగానే యాభై ఐదు వేల మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చామన్నారు. తెలంగాణలో రెండు లక్షల రుణమాఫీ చేశామని తెలిపారు.
ఐదు వందలకే గ్యాస్ సిలిండర్...
అలాగే ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ను అందచేస్తామని ప్రకటించారు. తెలంగాణలో తమ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని, ఇప్పటికే ఆరు గ్యారంటీలను అమలు చేసిందని ఆయన చెప్పుకొచ్చారు. ఢిల్లీలో కూడా కాంగ్రెస్ ను గెలిపిస్తే ఇచ్చిన రెండు గ్యారంటీలను తప్పక అమలు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీకి నరేంద్ర మోదీ, కేజ్రీవాల్ చేసిందేమీ లేదన్న రేవంత్ రెడ్డి, ఈ ఇద్దరూ కలసి ఢిల్లీని నాశనం చేశారని, ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు.