మణిపూర్ ఘటనపై సుప్రీం సీరియస్.. సినీ, రాజకీయ ప్రముఖుల దిగ్భ్రాంతి

మణిపూర్ లో జరిగిన ఈ ఘటనకు.. బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ను పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు..

Update: 2023-07-20 10:30 GMT

manipur women viral video disturbs india

కొద్దిరోజులుగా జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్ లో దారుణమైన అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కొందరు వ్యక్తులు ఇద్దరు మహిళలపై లైంగిక దాడికి పాల్పడి వారిని నగ్నంగా ఊరేగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటనపై యావత్ దేశమంతా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని మొదటు.. సినీ, రాజకీయ ప్రముఖులంతా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. శాంతి భద్రతలు, ఇతర కారణాల దృష్ట్యా వెంటనే మహిళలను నగ్నంగా ఊరేగించే వీడియోలను తొలగించాలని ట్విట్టర్ సహా పలు సోషల్ మీడియా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా సంస్థలు భారత చట్టాలకు సహకరించాలని కేంద్రం ఆదేశాల్లో పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ట్విట్టర్ పై కేంద్రం చర్యలు తీసుకుంటామని తెలిపింది.

మణిపూర్ లో జరిగిన ఈ ఘటనకు.. బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ను పదవి నుంచి తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దీనిపై స్పందించిన సీఎం.. ఘటనను సుమోటోగా పరిగణించి కేసు నమోదు చేశామని తెలిపారు. ఘటనకు కారణమైన ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వైరల్ అయిన వీడియో ఆధారంగా నిందితుడిని గురువారమే అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది మే 4వ తేదీన మణిపూర్ రాజధాని ఇంఫాల్ కు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాంగ్ పోష్కి జిల్లాలో ఈ ఘటన జరగ్గా.. బుధవారం (జులై18) వీడియో వైరల్ అయింది. వీడియోలో నగ్నంగా ఊరేగించిన మహిళలపై కొందరు పురుషులు సమీపంలోని పొలంలో అత్యాచారం చేశారని ఓ ఆదివాసీ సంస్థ ఆరోపించింది.
మణిపూర్ ఘటన తనను ఎంతో దిగ్భ్రాంతికి గురిచేసిందని నటుడు అక్షయ్ కుమార్ తెలిపారు. నిందితులను అత్యంత కఠినంగా శిక్షిస్తారని ఆశిస్తున్నానని, అలా జరిగితేనే మరొకరు ఇలా ఆలోచించకుండా ఉంటారని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు.

మణిపూర్ ఘటన దేశానికే సిగ్గుచేటు : ప్రధాని మోదీ

నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశ ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన ప్రధాని.. మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఇది దేశానికే సిగ్గుచేటన్న ప్రధాని.. ఈ ఘటనకు కారణమైన ఏ ఒక్క నిందితుడినీ వదలబోమని తెలిపారు. ఈ ఘటనపై ప్రతిఒక్కరూ రాజకీయాలకు అతీతంగా స్పందించాలని తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించేందుకు చట్టం పూర్తిగా పనిచేస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
మరోవైపు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై ఇలాంటి దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ ఘటనపై కేంద్రం తగు చర్యలు తీసుకోకపోతే సుప్రీంకోర్టే చర్యలు చేపడుతుందన్నారు. ఘటనను సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు.. ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని పేర్కొంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ధర్మాసనం ఆదేశించింది.







Tags:    

Similar News