ప్రముఖ వామపక్ష నేత, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. సీతారాం ఏచూరిని ఆగస్టు 19న ఎయిమ్స్‌లోని ఎమర్జెన్సీ వార్డులో చేర్చారు. ఆ తర్వాత ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)కి తరలించారు. ఆయన న్యుమోనియా ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నాడని సీపీఎం నేతలు తెలిపారు. ఏచూరి ఇటీవల కంటిశుక్లం శస్త్రచికిత్స కూడా చేయించుకున్నారు. ఊహించని విధంగా ఆయన ఆరోగ్యం దెబ్బతింది. లైఫ్ సపోర్ట్ మీద ఆయన్ను ఉంచారు. చివరికి ఆయన చనిపోయినట్లుగా వైద్యులు ప్రకటించారు.
మూడు దశాబ్దాలకు పైగా సీపీఎంలో కీలక బాధ్యతలను ఆయన చేపట్టారు. పొలిట్‌బ్యూరో సభ్యుడుగా మాత్రమే కాకుండా, 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ ఎంపీగా కూడా ఉన్నారు. సీతారాం ఏచూరి 1952 ఆగస్టు 12న చెన్నైలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు కల్పకం, సర్వేశ్వర సోమయాజులు ఏపీలోని కాకినాడకు చెందినవారు. చెన్నైలో పుట్టిన సీతారాం ఏచూరి హైదరాబాద్ లో విద్యాభ్యాసం చేశారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో బీఏ ఎకనామిక్స్ చదివారు. 1975 ఎమర్జెన్సీ సమయంలో ఆయన జేఎన్ యూ విద్యార్థిగా ఉన్నారు. ఆ సయయంలో ఆయనను కూడా అరెస్ట్ చేశారు. 1992లో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యునిగా ఎన్నికయ్యారు. నాలుగు సంవత్సరాల తరువాత, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కోసం కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ ను రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన నాయకులలో ఆయన ఒకరు. 2004లో యూపీఏ ప్రభుత్వానికి పాలక సంకీర్ణాన్ని ఏర్పాటు చేయడంలో యేచూరి ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆయన మరణంపై పలువురు ప్రముఖులు, నేతలు, ప్రజలు నివాళులు అర్పిస్తూ ఉన్నారు.