Dana Cyclone : తీరం దాటిన దానా... ప్రజలు ఎవరూ బయటకు రావద్దు
దానా తుపాను తీరం దాటింది. ఒడిశాలో తీరం దాటడంతో అక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి
దానా తుపాను తీరం దాటింది. ఒడిశాలో తీరం దాటడంతో అక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి. ఒడిశాలోని బిత్తర్‌కనిక జాతీయ పార్క్, ధమ్రా మధ్య గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రక్రియ ఈరోజు ఉదయం వరకూ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. ఈ సమయంలో ప్రచండమైన ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దాదాపు 120 కిలమీటర్ల వేగంతో గంటకు ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపారు. అలాగే ఒడిశాలోని అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల చెట్లు నేలమట్టమయ్యాయి. తుపాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజుల పాటు ఈ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు.
రెండు రోజులు భారీ వర్షాలు
దీంతో ఆయా రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఈ ప్రాంతంలో వెళ్లే దాదాపు నాలుగు వందల రైళ్లను రైళ్ల శాఖ రద్దు చేసింది. విమానాలు రద్దయ్యాయి. ఇప్పటికే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు, తుపాను తీవ్రత ఎక్కువగా ఉండే తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. తుపాను ప్రభావంతో అనేక చోట్ల రహదారులన్నీ నీటితో నిండిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు బయటకు రావడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. మరికొంత సమయం ఇదే రకమైన వాతావరణం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతంలోనే ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది.