కొనసాగుతున్న మాండూస్ ప్రభావం.. విద్యాసంస్థలకు సెలవులు
వాతావరణశాఖ సూచనల నేపథ్యంలో తమిళనాడులోని పలు జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు నిన్న, ఈరోజు ..
మాండూస్ తుపాను తీరం దాటింది. ఏపీతో పాటు తమిళనాడులోనూ పంట వర్షార్పణమయింది. రైతన్న గుండెల్లో పుట్టిన గుబులు నిజమైంది. ప్రస్తుతానికి ఏపీలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. నిన్న అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడినా నేడు వాతావరణం పొడిగా ఉంది. కాగా.. భారత వాతావరణశాఖ సూచన ప్రకారం డిసెంబర్ 15 వరకూ మాండూస్ ప్రభావంతో దక్షిణ భారత రాష్ట్రాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు, అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడొచ్చు.
వాతావరణశాఖ సూచనల నేపథ్యంలో తమిళనాడులోని పలు జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు నిన్న, ఈరోజు (డిసెంబర్ 13,14) సెలవులు ప్రకటించారు. అలాగే కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో వర్షాల కారణంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. రేపు విద్యాసంస్థలు తిరిగి తెరచుకుంటాయో..లేదో..అన్న విషయంపై ఇప్పటి వరకు ఇంకా స్పష్టత రాలేదు. కేరళ, కర్ణాటక, గోవా తీరప్రాంతాల్లో జాలర్లు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.
అలాగే లక్షద్వీపం, ఆగ్నేయ అరేబియా తీర ప్రాంతాల్లో డిసెంబర్ 15 సాయంత్రం వరకు, తూర్పుమధ్య అరేబియా సముద్ర ప్రాంతాల్లో డిసెంబర్ 17వ తేదీ వరకు సముద్రంపై వేటకు వెల్లవద్దని జాలర్లను భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.