తుపానుగా మారనున్న తీవ్ర వాయుగుండం.. ఏపీకి వర్షసూచన
తీవ్ర వాయుగుండం మరింత బలపడి నేడు తుపానుగా మారొచ్చని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తీవ్ర వాయుగుండం, అసని తుపాను..
అమరావతి : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. సోమవారానికి బలపడి తీవ్రవాయుగుండంగా మారింది. తీవ్ర వాయుగుండం మరింత బలపడి నేడు తుపానుగా మారొచ్చని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తీవ్ర వాయుగుండం, అసని తుపాను ప్రభావంతో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురవచ్చని తెలిపారు. 12 గంటల్లో తుపాను అండమాన్ దీవుల వెంట ఉత్తరం వైపుగా కదులుతుందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకురాలు స్టెల్లా తెలిపారు.
ఈ తుపాను బుధవారం (మార్చి23) తాండ్వే (మయన్మార్) సమీపంలో తీరం దాటే అవకాశం ఉందన్నారు.కాగా.. వాయుగుండం ప్రభావంతో సోమవారం ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. చిత్తూరు, విశాఖ. తూర్పు గోదావరి, విజయనగరం, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. విశాఖ జిల్లా మన్యంలో ఆకస్మిక వడగళ్లు పడ్డాయి. నర్సీపట్నం, పాడేరు, కొయ్యూర్, హుకుంపేట, కోటవురట్ల మండలాల్లో ఈదురుగాలులతో వడగళ్లు పడ్డాయి. ఫలితంగా తోటలు, పంటపొలాలు దెబ్బతిన్నాయి.