దీపావళికి టపాసులపై నిషేధం.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

అక్కడ వాయుకాలుష్యం.. శీతాకాలంలో మంచు పట్టినట్లు అల్లేస్తుంది. ఈ కాలుష్యంపై గతంలో సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో..

Update: 2022-09-07 11:34 GMT

రోజురోజుకీ వాయుకాలుష్యం పెరిగిపోతుంది. మనం పీల్చుకునే గాలిసైతం కలుషితమవుతోంది. వాయుకాలుష్యం కారణంగా వృద్ధులు, ఆస్తమా ఉన్నవారు, ఊపిరితిత్తుల్లో సమస్యలున్నవారు ఇలా చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే చాలా వరకూ సైకిళ్లు, మూడు చక్రాల రిక్షాలు కనుమరుగయ్యాయి. వాటి స్థానంలో బైకులు, ఆటోలు, కార్లు కుప్పలు తెప్పలుగా వచ్చేస్తున్నాయి. ముఖ్యంగా కార్లు, టూవీలర్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ రోజుల్లో 95 శాతం వరకూ టూ వీలర్ లేని ఇల్లు లేదు. ఫలితంగా వాయుకాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో అయితే.. పరిస్థితి మరీ దారుణంగా ఉంది.

అక్కడ వాయుకాలుష్యం.. శీతాకాలంలో మంచు పట్టినట్లు అల్లేస్తుంది. ఈ కాలుష్యంపై గతంలో సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో ఆందోళన వ్యక్తం చేసింది. ఆప్ ప్రభుత్వం కూడా కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎన్నో చర్యలు చేపట్టింది. వాహనాల సరి, బేసి సంఖ్యల ఆధారంగా రోజువిడిచి రోజు వాడుకోవాలన్న నిబంధన తెచ్చింది. వాయు కాలుష్యం కారణంగా ఆప్ ప్రభుత్వం గతేడాది దీపావళికి టపాసులను నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా కేజ్రీవాల్ ప్రభుత్వం టపాసులు కాల్చడాన్ని పూర్తిగా నిషేధించింది. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు.
జనవరి 1వ తేదీ వరకూ ఈ నిషేధం అమల్లో ఉంటుందన్నారు. టపాసుల ఆన్ లైన్ విక్రయాలపై కూడా నిషేధం విధించామని, అన్ని రకాల టపాసుల ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధిస్తున్నామని వెల్లడించారు. వాయు కాలుష్యం నుంచి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఈ నిషేధం విధించక తప్పడం లేదన్నారాయన. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ఎవరైనా టపాసులు పేల్చితే వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి గోపాల్ రాయ్ హెచ్చరించారు.


Tags:    

Similar News