శృంగారానికి నిరాకరించిన భర్త.. సంచలన తీర్పు ఇచ్చిన కోర్టు

సదరు మహిళకు డిసెంబర్ 18,2019లో వివాహం జరిగింది. ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించే ఆమె భర్త.. శారీరకంగా ఆమెతో కలిసేందుకు..

Update: 2023-06-20 06:27 GMT

దాంపత్య జీవితంలో భార్య-భర్తల కలయిక సహజం. అది ధర్మంగా జరగాలి. హిందూ వివాహ చట్టం ప్రకారం భార్యతో శారీరక సంబంధానికి భర్త అంగీకరించకపోవడం క్రూరమే అయినా.. ఐపీసీ సెక్షన్ 498ఏ ప్రకారం అది నేరం కాదని కర్ణాటక హైకోర్టు పేర్కొంది. తన వివాహ జీవితం పరిపూర్ణంగా లేదంటూ ఓ మహిళ తన భర్త, అత్తమామలపై పెట్టిన క్రిమినల్ కేసును కోర్టు కొట్టివేసింది. వివరాల్లోకి వెళ్తే..

సదరు మహిళకు డిసెంబర్ 18,2019లో వివాహం జరిగింది. ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించే ఆమె భర్త.. శారీరకంగా ఆమెతో కలిసేందుకు నిరాకరించాడు. అత్తింట్లో 28 రోజులు మాత్రమే ఉన్న ఆ మహిళ పుట్టింటికి వెళ్లిపోయింది. 2020 ఫిబ్రవరిలో ఐపీసీ సెక్షన్ 498ఏ, వరకట్న నిరోధక చట్టం కింద భర్త, అత్తమామలపై కేసు పెట్టింది. అలాగే హిందూ వివాహ చట్టం ప్రకారం తన వైవాహిక జీవితం పరిపూర్ణం కాలేదని, తమ పెళ్లిని రద్దు చేయాలని కోరుతూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ ను పరిశీలించిన ఫ్యామిలీ కోర్టు.. 2022 నవంబరులో వారి వివాహాన్ని రద్దు చేసింది.
వివాహం రద్దైనా.. అత్తింటివారిపై పెట్టిన క్రిమినల్ కేసు మాత్రం మహిళ వెనక్కి తీసుకోలేదు. దాంతో అతను కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు. ఇటీవల దానిపై విచారణ జరిపిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భర్త ఆధ్యాత్మిక మార్గంలో ఉండటంతో.. ప్రేమ అనేది మనసులకు సంబంధించినదే అని, శారీరక బంధం కాదని విశ్వసించాడని పేర్కొంది. హిందూ వివాహచట్టం ప్రకారం భార్యతో శారీరక బంధాన్ని నిరాకరించడం క్రూరత్వమే అయినా.. ఐసీపీ సెక్షన్ 498ఏ ప్రకారం అది నేరం కాదని వెల్లడించారు. ఈ కేసులో అతనిపై క్రిమినల్ చర్య తీసుకుంటే అది వేధింపుల కిందకే వస్తుందంటూ.. అతనిపై భార్య పెట్టిన క్రిమినల్ కేసుని కొట్టివేస్తున్నట్లు తీర్పునిచ్చింది.


Tags:    

Similar News