Ayodhya : కిటకిటలాడుతున్న అయోధ్య.. లక్షల మంది రాకతో
అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్టాపన జరిగిన తర్వాత తొలి శ్రీరామ నవమి వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు
అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్టాపన జరిగిన తర్వాత తొలి శ్రీరామ నవమి వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. అయోధ్య వీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీరామనవమి కావడం, రాముడి జన్మభూమి అని నమ్మికతో ఎక్కువ మంది భక్తులు విశేషంగా దేశం నలుమూలల నుంచి తరలి వచ్చారు. ఈ రోజు అయోధ్యలో బాలరాముడి శిరస్సును సూర్యకిరణాలతో అభిషేకం చేయనున్నారు. దీనిని చూసేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.
సూర్యకిరణాలతో...
మధ్యాహ్నం 12.16 గంటలకు సూర్య కిరణాలు బాలరాముడి శిరస్సును తాకనున్నాయి. మొత్తం నాలుగు నిమిషాలు సూర్యకిరణాలను తాకే విధంగా ఏర్పాట్లు చేశారు. ఈరోజు తెల్లవారు జామునుంచే భక్తులు అయోధ్య రాముడిని సందర్శించుకునేందుకు బారులు తీరారు. ఈరోజు యాభై ఆరు రకాల నైవేద్యాలను కూడా బాలరాముడికి సమర్పించనున్నారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండటంతో గంటల తరబడి దర్శనం కోసం భక్తులు వేచి చూడాల్సి వస్తోంది.