Karnataka : గ్యారంటీలు అమలు చేయలేక.. ఆపసోపాలు... అభివృద్ధి ఎక్కడ బాబాయ్?

కర్ణాటకలో ఐదు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ఆపసోపాలు పడుతుంది.

Update: 2024-07-18 04:31 GMT

ఇచ్చిన హామీలు అమలు చేయడం అంత సులువు కాదు. రాష్ట్ర ఖజానా అందుకు సరిపోదు. కర్ణాటకలో ఐదు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ఆపసోపాలు పడుతుంది. మరో వైపు ఎప్పటికప్పుడు వివిధ వర్గాల నుంచి వస్తున్న డిమాండ్లను నెరవేర్చాలి. ఇచ్చిన హామీలు సక్రమంగా అమలు చేయకపోవడం వల్లనే మొన్న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కన్నడ ప్రజలు కాంగ్రెస్ కు తక్కువ సీట్లను కట్టబెట్టారు. దీంతో చివరకు సిద్ధరామయ్య తన ముఖ్యమంత్రి సీటు కిందకు నీరు తెచ్చుకున్నారు. ఆయనను తప్పించాలంటూ అధినాయకత్వానికి పెద్దయెత్తున ఫిర్యాదులు అందుతున్నాయి.

రోడ్డు వేయలేని...
మరోవైపు అభివృద్ధి పనులు పూర్తిగా మందగించాయి. కనీసం రోడ్లు వేయలేని దుస్థితి నెలకొంది. గ్రామాల్లో మంచి నీటి సౌకర్యం కల్పించలేని పరిస్థితుల్లో సిద్ధరామయ్య ప్రభుత్వం ఉంది. ఎంత పెంచిన మద్యం ధరలపై తప్పించి మరే ధరలను పెంచినా మళ్లీ ప్రజల్లో వ్యతిరేకత మరింత ఎక్కువవుతుంది. ఇప్పటికే ఉచిత కరెంట్ వ్యవహారంతో పరిశ్రమలు, హోటళ్లు వంటి వాణిజ్య అవసరాలకు వినియోగించే విద్యుత్తు పై ఛార్జీలను పెంచారు. ఇది నేరుగా ప్రభావం చూపకపోయినా భవిష్యత్ లో వారి ఇన్‌ఫ్లూయెన్స్ ఖచ్చితంగా పడుతుందన్న అంచనాల్లో అధికార పార్టీ నేతలున్నారంటే అతిశయోక్తి కాదు.
ఉచిత పథకాల వల్ల...
ఉచిత పథకాల వల్ల తమ నియోజకవర్గాల్లో కనీస పనులు చేపట్టలేకపోతున్నామని సొంత పార్టీ ఎమ్మెల్యేలే అంటున్నారంటే పరిస్థితి ఎంత వరకూ వచ్చిందో ఇట్టే ఊహించుకోవచ్చు. కనీసం మున్సిపాలిటీల పరిధిలో రోడ్లు వేయలేకపోతున్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బహిరంగ ప్రకటన చేసే స్థాయి వరకూ వచ్చారంటే ఎమ్మెల్యేల్లో ఎంత అసహనం ఉందో వేరే చెప్పాల్సిన పనిలేదు. అందుకే సిద్ధరామయ్య దీనికి విరుగుడు కనిపెట్టినట్లుంది. సెంటిమెంట్ తో కొంత డైవర్ట్ చేయాలన్న నిర్ణయం వివాదాస్పదమవుతుందని తెలిసినా వెనకడుగు వేయకుండా ముందుకు వెళుతున్నారంటే ఖచ్చితంగా ప్రజల మనసులను సెంటిమెంట్ తో చిలకరించాలన్నదేనన్నది వాస్తవం.
నేడు బిల్లుతో...
తాజాగా సిద్ధరామయ్య ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పరిశ్రమ వర్గాల్లో కలకలం రేపింది. ప్రయివేటు సంస్థల్లో కింది స్థాయి ఉద్యోగాలన్నీ కన్నడిగులతోనే భర్తీ చేయాలని ఆయన ఏకంగా చట్టం తీసుకురావడం వెనక డైవర్ట్ పాలిటిక్స్ అని అంటున్నారు. సొంత రాష్ట్ర ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పైకి చెబుతున్నప్పటికీ కన్నడిగుల అభిమానాన్ని చూరగొనేందుకు సిద్ధరామయ్య ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. నేడు దీనికి సంబంధించన బిల్లును శాసనసభలో ప్రవేశపెడుతుంది. ప్రయివేటు సంస్థల్లో గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టులను ఖచ్చితంగా కన్నడిగులతోనే భర్తీ చేయాలని ఈ బిల్లులోని ప్రధానాంశం. పరిశ్రమలోని మేనేజ్‌మెంట్ కేటగిరిలో యాభై శాతం మందిని, నాన్ మేనేజ్‌మెంట్ కేటగిరిలో 70 శాతం మందిని స్థానిలకులనే నియమించాలంటూ ఈ బిల్లును నేడు ప్రవేశపెట్టబోతున్నారు. దీనిపై పరిశ్రమ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా సిద్దూ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. అయితే దీనిపై పరిశ్రమల వర్గాల నుంచి వస్తున్న వత్తిడితో సిద్ధరామయ్య వెనక్కు తగ్గుతారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.


Tags:    

Similar News