ఢిల్లీలో మరోసారి భూకంపం

Update: 2022-11-13 02:21 GMT

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భూప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించిందని.. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. భూకంప కేంద్రం నేపాల్ లో ఉందని, రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 5.4 అని తెలిపింది. రాత్రి 7.57 గంటల సమయంలో ప్రకంపనలు వచ్చినట్టు పేర్కొంది. దేశ రాజధాని ప్రాంతంలో భూప్రకంపనలు రావడం వారం రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. గత బుధవారం కూడా ఢిల్లీలో భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఓ భారీ భూకంపం వచ్చేందుకు అత్యధిక అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు ఇటీవల హెచ్చరిస్తున్నారు. తగిన చర్యలు తీసుకుంటే ప్రాణ, ఆస్తి నష్టాలను తగ్గించవచ్చని చెబుతున్నారు. ఇటీవల కాలంలో భారత భూ ఫలకంపై యూరేషియన్ భూ ఫలకం ఒత్తిడి స్థిరంగా కొనసాగుతోందని, ఈ సందర్భంగా జనించే శక్తి భూకంపాల రూపంలో వెలువడుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు. నేపాల్ పశ్చిమ దిశలో సంభవించిన ఈ భూకంప తీవ్రత అనూహ్యంగా నమోదైంది. దీని తీవ్రత ఢిల్లీ-నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిపైనా దీని ప్రభావం పడింది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని పలు ప్రాంతాలు కంపించాయి. ఢిల్లీతో పాటు ఉత్తరాఖండ్‌లోని న్యూ తెహ్రీ, పితోరాగఢ్, బాగేశ్వర్, పౌరీ వంటి ప్రాంతాల్లోనూ భూకంప తీవ్రత కనిపించింది. ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున ఫలకాల్లో చోటు చేసుకున్న కదలికల వల్ల భూమి కంపించినట్లు నిపుణులు తెలిపారు. ఈ పెను భూకంపం వల్ల ప్రాణనష్టం సంభవించలేదని పేర్కొన్నారు.


Tags:    

Similar News