వచ్చే వేసవిలో.. మరింత మంటలు : నిపుణుల హెచ్చరిక

తాజాగా నిపుణులు చేసిన హెచ్చరికలతో మళ్లీ ఆందోళన మొదలైంది. ఎల్ నినో ప్రభావం ఈ ఏడాది దేశ వ్యవసాయంపై తీవ్రంగా..

Update: 2023-06-22 09:03 GMT

el nino effect on rabi crops

మండుటెండలు అంటే ఏమిటో ఈ ఏడాది వేసవిలో ప్రజలకు అర్థమై ఉంటుంది. గతంలో ఎన్నడూ లేనంతగా.. ఈ సారి వేసవి ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరాయి. ముఖ్యంగా ఏపీలో ఉష్ణోగ్రతలు 46-47 డిగ్రీలను తాకాయి. తీవ్రమైన వేడిగాలులు, విపరీతమైన ఉక్కపోత, ఠారెత్తించే ఎండలు.. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకేలా చేశాయి. వీటన్నింటికీ తోడు అనధికార కరెంటు కోతలు మరింత ఇబ్బంది పెట్టాయి. రోహిణి కార్తె పూర్తయి.. మృగశిర రాకతోనే పలుకరించాల్సిన తొలకిరి చాలా ఆలస్యమైంది. ఫలితంగా అధిక ఉష్ణోగ్రతలతో రాష్ట్రం ఉష్ణగోళాన్ని తలపించింది. రెండురోజుల క్రితం నుంచి నైరుతి రుతుపవనాలు వ్యాపిస్తుండటంతో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయి.

తాజాగా నిపుణులు చేసిన హెచ్చరికలతో మళ్లీ ఆందోళన మొదలైంది. ఎల్ నినో ప్రభావం ఈ ఏడాది దేశ వ్యవసాయంపై తీవ్రంగా ఉంటుందన్న భయం వ్యక్తమవుతోంది. జూన్ చివరి వారానికి వచ్చినా.. సగటు వర్షపాతంలో సగం మాత్రమే నమోదైంది. ఇకనైనా రుతుపవనాలు వేగం పుంజుకుని సరైన వర్షాన్నిస్తాయా ? అంటే కష్టమేనన్న సమాధానం వినిపిస్తోంది. రుతుపవనాలు దేశమంతా విస్తరించిన తర్వాత.. బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడితే.. ఆ ప్రభావంతో కురిసే వర్షాల ద్వారా వర్షసంక్షోభం నుంచి బయటపడొచ్చంటున్నారు నిపుణులు. అయితే.. ఎల్ నినో ప్రభావం వర్షాల పైనే కాకుండా.. శీతాకాలం పై కూడా ఉంటుందని చెబుతున్నారు. ఖరీఫ్, రబీ పంటలపై దీని ప్రభావం ఉంటుందని తెలుస్తోంది.
వచ్చే ఏడాది వేసవికాలం.. ఇంతకుమించి ఉండొచ్చన్న హెచ్చరికలు ఇప్పటినుండే ఆందోళనకు గురిచేస్తున్నాయి. రాబోయే వేసవి ఎల్ నినో ప్రభావంతో మంటలు మండిస్తుందని అంచనా వేశారు. శీతాకాలం వర్షాలపై ఎల్ నినో ప్రభావం పడుతుందని భారత వాతావరణ శాఖ సీనియర్ సైంటిస్ట్ డీఎస్ పాయ్ తెలిపారు. రబీ పంటలైన గోధుమ, చానా, ఆవాలకు శీతాకాలంలో పడే వర్షాలు కీలకం. ఎల్ నినో పరిస్థితులు ఇప్పటికే కనిపిస్తున్నాయని, ఇవి క్రమంగా బలపడతాయని అమెరికా ప్రభుత్వ వాతావరణ అంచనా కేంద్రం కూడా తెలిపింది.



Tags:    

Similar News