Prashanth Kishore : పీకే వచ్చాడంటే ఏదో మర్మం దాగున్నట్లేనా?
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి వార్తల్లోకి వచ్చారు;

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. తాను ఎన్నికల వ్యూహకర్తగా ఇక పనిచేయబోనని చెప్పిన పీకే తాజాగా తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026లో జరగనున్నాయి. ఇందులో సినీనటుడు విజయ్ పెట్టిన తమిళ వెట్రి కళగం పార్టీ రెండో మహానాడుకు ఆయన హాజరవ్వడం నిజంగా రాజకీయ నేతలను ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే బీహార్ లో సొంత పార్టీ పెట్టి ఇక ఎన్నికల వ్యూహకర్త గా వ్యవహరించబోనని, బీహార్ లో తన పార్టీ గెలుపునకు మాత్రమే పనిచేస్తానని చెప్పిన ప్రశాంత్ కిషోర్ ఉన్నట్లుండి తమిళనాడులో ఎంట్రీ ఇవ్వడం మాత్రం ఎవరూ ఊహిచంలేదు.
ట్రాక్ రికార్డు బాగున్నా...
ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ట్రాక్ రికార్డు హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా 90 పర్సెంట్ సక్సెస్ రేటు ఉంది. గత తమిళనాడు ఎన్నికల్లో డీఎంకేకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి ఆంధ్రప్రదేశ్ లోనూ, 2000లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీపార్టీకి, అంతకు ముందు పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు. బీహార్ లోనూ గతంలో నితీష్ కుమార్ కు అండగా నిలిచారు. తొలుత ప్రధాని నరేంద్ర మోదీకి కూడా సలహాలు, సూచనలు అందించారు. కానీ 2023 తర్వాత ఆయన ఎన్నికల వ్యూహకర్త బాధ్యతల నుంచి తప్పించుకున్నారు. ఆయనకు చెందిన ఐప్యాక్ టీం ను కూడా వదిలేసి పూర్తి కాలం బీహార్ రాజకీయాలకే పరిమితమయ్యారు. బీహార్ లో సుదీర్ఘ పాదయాత్ర కూడా చేశారు.
టీవీకే ఎన్నికల వ్యూహకర్తగా...
అయితే తమిళనాడులో ఆయన టీవీకే పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తుండటం ఇప్పుడు రాజకీయ పార్టీల్లో చర్చనీయాంశమైంది. మహానాడులో విజయ్ పై ప్రశాంత్ కిషోర్ ప్రశంసల వర్షం కురిపించారు. తమిళనాడులో అవినీతి రాజ్యమేలుతుందని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీవీకే పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రావడం ఖాయమన్న ఆయన తాను సక్సెస్ మీట్ కు వచ్చి తమిళంలోనే మాట్లాడతానని చెప్పడం విశేషం. అయితే ప్రశాంత్ కిషోర్ విజయ్ పార్టీకి మద్దతివ్వడానికి పెద్దయెత్తున ఆర్థిక ప్యాకేజీ లభించిందని, అందుకే ఆయన ఎన్నికల వ్యూహకర్తగా అంగీకరించారని డీఎంకే నేతలు చెబుతున్నారు. ప్రశాంత్ కిషోర్ తాను ఒకసారి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన పార్టీ గెలిచిన తర్వాత గెలిచిన అధికార పార్టీతో విభేదాలు వస్తుండటం ఇక్కడ గమనించాల్సిన అంశం. తమిళనాడులో డీఎంకేతోనూ, ఏపీలో వైసీపీతోనూ ఆయన విభేదించడానికి కారణాలు ఏమై ఉంటాయన్న దానిపై జోరుగా చర్చ జరుగుతుంది.