Prashanth Kishore : సక్సెస్ రేటు ఎక్కువ కావడం వల్లనే అంతగా నమ్మాల్సి వస్తుందా?
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెబుతున్న లెక్కలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చెబుతున్న లెక్కలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. కౌంటింగ్ కు ముందే కొందరు ఆయన చెప్పిన లెక్కలు విని వణికపోతున్నారు. మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఎక్కడో కూర్చుని దేశ ఎన్నికల ఫలితాలతో పాటు వివిధ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను కూడా ఆయన చెప్పేస్తున్నారు. ఆయన మాటలో కొంత నిజం ఉందని అందరూ నమ్ముతారు. ఎందుకంటే వ్యూహకర్తగా ఆయన సక్సెస్ రేటు ఎక్కువేనని చెప్పాలి. ఎందరినో ముఖ్యమంత్రి పదవిని దగ్గరకు చేర్చారన్న పేరుంది. ఆయనంటే రాజకీయవర్గాల్లో ఒకరకమైన విశ్వాసం. ఆయన పక్కనుంటే చాలు తమ గెలుపు యాభై శాతం ఢోకా లేనట్లేనని భావిస్తారు. అందుకు ఎంత డబ్బును ఖర్చు చేయడానికైనా వెనుకాడరు.
వేర్వేరు కారణాలంటూ...
అయితే ఆయన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ లో వరసగా గెలుపులు అందించడంతో ఆయన రాజకీయ నేతలకు విజయానికి దగ్గర దారి చూపించే వ్యక్తిగా భావిస్తారు. అయితే 2019 లో ఆంధ్రప్రదేశ్ లో నాటి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో అంత భారీ విజయాన్ని వైసీపీ అందుకుందన్న వాదనను కూడా కాదనలేం. అలాగే తమిళనాడులోనూ జయలలిత మరణం తర్వాత ఆ పార్టీ బలహీనంగా మారడంతో స్టాలిన్ విజయం ఏకపక్షమేనని అందరూ అంచనా వేశారు. ఇక పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ గత రెండు సార్లు ప్రశాంత్ కిషోర్ సాయం లేకుండానే గెలిచారన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు కొందరు. ఇలా ఆయనను నమ్మే రాజకీయ నేతలు అధిక శాతం మంది ఉంటే.. వ్యతిరేకించే వారు కొందరే ఉన్నారు.
తాజా ట్వీట్ తో...
ఆయన పూర్తిగా ఎన్నికల వ్యూహకర్త నుంచి పక్కకు తప్పుకున్నారు. బీహార్ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుని కాళ్లకు పనిచెప్పి మళ్లీ విరమించుకున్నట్లే ఉంది. అయితే గత కొద్ది రోజులుగా దేశంలో బీజేపీకి ఈసారి 270 స్థానాలతకు వస్తాయని ఆయన చెబుతున్నారు. తాజాగా కూడా ఆయన చేసిన ట్వీట్ ఇందుకు అద్దం పడుతుంది. జూన్ నాలుగో తేదీన మీ గొంతు తడారిపోకుండా నీళ్లు దగ్గరపెట్టుకోండి అంటూ ఒకరకంగా మీడియా, కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు అనిపిస్తుంది. దక్షిణ భారత దేశంలోనూ బీజేపీ పుంజుకుంటుందని చెప్పారు. అలగే ఏపీ ఎన్నికల ఫలితాలపై ఆయన తరచూ వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ అధికారం కోల్పోవం ఖాయమని, కూటమి అక్కడ గెలుస్తుందని చెబుతున్నారు. మొత్తం మీద ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ కు అధిక శాతం మంది నమ్ముతుండగా, తమకు వ్యతిరేకంగా చెప్పిన వారు మాత్రం కాదంటున్నారు. ఆయనపై విమర్శలు చేస్తున్నారు. మరి పీకే జోస్యం ఫలిస్తుందా? లేదా? అన్నది జూన్ 4వ తేదీన తేలనుంది.