చంపై సోరెన్ బీజేపీలోకి.. ముహూర్తం ఫిక్స్
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ బీజేపీలో చేరేందుకు ముహూర్తం తేదీ ఖరారయింది.
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ బీజేపీలో చేరేందుకు ముహూర్తం తేదీ ఖరారయింది. ఈ నెల 30వ తేదీన ఆయన బీజేపీలో చేరనున్నారని అస్సాం ముఖ్యమంత్రి ఎక్స్ లో తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన బీజేపీలో చేరతారని తెలిపారు. చంపై సోరెన్ కొద్ది కాలం ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. హేమంత్ సోరెన్ మనీలాండరింగ్ కేసులో జైలుకు వెళ్లినప్పుడు ఆయనను ముఖ్యమంత్రిగా చేశారు.
సొంత పార్టీ పెడతానని...
తిరిగి హేమంత్ సోరెన్ బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత చంపై సోరెన్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేసి తిరిగి హేమంత్ సోరెన్ సీఎంగా బాధ్యతలను స్వీకరించాడు. అయితే ఇది ఇష్టంలేని చంపై సోరెన్ సొంత పార్టీ పెట్టాలని తొలుత భావించారు. అధికారికంగా ప్రకటించారు కూడా. కానీ బీజేపీ పెద్దల మంతనాల మేరకు ఆయన కమలం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. సోమవారం ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దీంతో ఆయన బీజేపీలో చేరిక ఖాయం అయినట్లు స్పష్టమయింది.