మృతదేహంతో పది కిలోమీటర్లు...?
కన్న తండ్రి తన కూతురు మృతదేహాన్ని పది కిలోమీటర్లు మోసుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది
ఛత్తీస్ ఘడ్ వైద్య ఆరోగ్య శాఖలో హృదయాన్ని కలచివేసే సంఘటన చోటు చేసుకుంది. మరణించిన వారి మృతదేహాలను తరలించేందుకు కనీసం వాహనాన్ని కూడా ఆ శాఖ ఏర్పాటు చేయలేదు. దీంతో కన్న తండ్రి తన కూతురు మృతదేహాన్ని పది కిలోమీటర్లు మోసుకెళ్లాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆరోగ్య శాఖ మంత్రి టీఎన్ సింగ్ విచారణకు ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
వాహనం ఏర్పాటు చేయకపోవడంతో...
ఛత్తీస్ ఘడ్ లోని అమ్ దాలా గ్రామానికి చెందిన ఈశ్వర్ దాస్ తన కుమార్తె సురేఖకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో లఖాన్ పూర్ గ్రామంలో ఉన్న ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లాడు. సురేఖకు గత కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతుంది. ఆసుపత్రిలో పరిశీలించిన వైద్యులు సురేఖ ఆక్సిజన్ స్థాయి తగ్గిందని గుర్తించారు. చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. అయితే తన గ్రామానికి తీసుకెళ్లేందుకు ఆసుపత్రి సిబ్బంది వాహనాన్ని ఏర్పాటు చేయక పోవడంతో ఈశ్వర్ దాస్ తన కుమార్తె మృతదేహాన్ని పది కిలోమీటర్లు మోసుకెళ్లాడు. ఈ ఘటన రాష్ట్రంలో కలకలం సృష్టించింది.