మాజీ ముఖ్యమంత్రి కన్నుమూత
కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఆయన వయసు 79 సంవత్సరాలు
కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఆయన వయసు 79 సంవత్సరాలు. బెంగళూరులోని ఓ ఆసుపత్రి చికిత్స పొందుతూ చాందీ తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఊమెన్ చాందీ గతంలో గొంతు సమస్యలకు చికిత్స తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ బెంగళూరులోని చిన్మయ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు ఊమెన్ చాందీ. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో మంగళవారం తెల్లవారు జామున 4:30 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
వరుసగా 12 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఊమెన్ చాందీ 1943 అక్టోబర్ 31న కొట్టాయం జిల్లాలోని కుమరకోమ్ గ్రామంలో జన్మించారు. సాధారణ కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. 1970లో ఊమెన్ చాందీ తనకు 27 ఏళ్ల వయసులో తొలిసారిగా పూతుపల్లి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. అదే నియోజకవర్గానికి ఏకంగా 12 సార్లు ఎమ్మెల్యేగా సేవలందించారు. 1977లో కె.కరుణాకరన్ క్యాబినేట్‌లో తొలిసారిగా చాందీకి మంత్రి పదవి దక్కింది. 2004-06, 2011-16 మధ్య కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా కూడా పని చేశారు.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత 2018లో ఏపీ వ్యవహారాల ఇంచార్జీగా పనిచేశారు. ప్రజాసేవకు గానూ ఐక్యరాజ్యసమితి నుంచి అవార్డు అందుకున్న ఏకైక భారతీయ సీఎం చాందీనే. ప్రస్తుతం ఆయన పార్థీవ దేహాన్ని తిరువనంతపురానికి ప్రజా సందర్శనార్థం తరలించారు. స్వస్థలం కొట్టాయంలోనే ఆయన అంత్యక్రియలు జరగనున్నాయని అంటున్నారు.