మాజీ ముఖ్యమంత్రి బాదల్ మృతి
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ మృతి చెందారు.
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ మృతి చెందారు. అనారోగ్యంతో కొంతకాలంగా బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి చికిత్స పొందుతూ మృతిచెందారు. వారం రోజుల క్రితం ప్రకాశ్ బాదల్ అనారోగ్యంతో మొహాలిలోని ఫోర్టిస్ హాస్పిటల్ ఆసుపత్రిలో చేరారు. బాదల్ మృతి పట్ల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం వ్యక్తం చేశారు. ప్రకాష్ సింగ్ బాదల్ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి అత్యంత ఉన్నతమైన రాజకీయ ప్రముఖులలో ఒకరిగా నిలిచారని ఆమె ట్వీట్ చేశారు.
పలువురి సంతాపం...
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ సంతాపం వ్యక్తం చేశారు. బాదల్ మృతిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ విచారాన్ని వ్యక్తం చేశారు. ఆయన మరణం చాలా బాధ కలిగించిందని మోదీ ట్వీట్ చేశారు. భారత రాజకీయాల్లో బాదల్ కీలక పాత్ర పోషించారని.. దేశానికి ఎంతో సేవ చేశారని ప్రధాని తన ట్వీట్లో పేర్కొన్నారు. బాదల్ మరణం తనకు వ్యక్తిగతంగా చాలా నష్టం చేకుర్చుందన్నారు. దశాబ్దాల పాటు బాదల్తో సాన్నిహిత్యం ఉందన్న మోదీ.. ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని తెలిపారు.