గీతాప్రెస్ రూ.కోటి నగదు పురస్కారాన్ని తిరస్కరించడానికి కారణమిదే..
నగదు రూపంలో వచ్చే అవార్డు ప్రోత్సాహకాలను తీసుకోకూడదని ట్రస్టీ బోర్డ్ నిర్ణయించింది. అందుకే ఈ నగదు పురస్కారాన్ని..
గోరఖ్‌పుర్ కు చెందిన గీతా ప్రెస్ కు కేంద్ర ప్రభుత్వం 2021 ఏడాదికి సంబంధించి గాంధీ శాంతి బహుమతిని ప్రకటించింది. ఈ అవార్డుతో పాటు రూ.1 కోటి నగదు, అభినందన పత్రం, జ్ఞాపిక, ప్రత్యేకమైన హస్త కళాకృతులను అందిస్తుంది. తాజాగా గీతా ప్రెస్ తమకు ఇచ్చిన పురస్కారంపై కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఇచ్చిన రూ.కోటి నగదు పురస్కారాన్ని తిరస్కరించినట్లు సమాచారం. అందుకు కారణం ఆ సంస్థకు ఉన్న నియమమే. ఈ విషయంపై సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ..
"ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక కావడం గర్వంగా ఉంది. ఎంతో గౌరవప్రదమైనది కూడా. కానీ ఎలాంటి విరాళాలు స్వీకరించకూడదనేది మా సూత్రం. నగదు రూపంలో వచ్చే అవార్డు ప్రోత్సాహకాలను తీసుకోకూడదని ట్రస్టీ బోర్డ్ నిర్ణయించింది. అందుకే ఈ నగదు పురస్కారాన్ని తిరస్కరిస్తున్నాం. ఈ మొత్తాన్నీ మరోచోట ఖర్చు చేయండి." అని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కాగా.. విశిష్ట వ్యక్తులు, సంస్థలను గుర్తించి గౌరవించేందుకు 1995లో కేంద్రం గాంధీ శాంతి బహుమతిని నెలకొల్పింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని అవార్డు ఎంపిక కమిటి ఆదివారం సమావేశమై ఏకగ్రీవంగా గీతా ప్రెస్ ను ఎంపిక చేసింది. కానీ కాంగ్రెస్ ఈ విషయాన్ని తప్పుబడుతూ వ్యాఖ్యలు చేయగా.. బీజేపీ ఆ విమర్శలను తిప్పికొట్టింది.