పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలపై అజెండాను విడుదల చేసిన కేంద్రం సర్కార్‌

ఈనెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈ సమావేశాల అజెండా..

Update: 2023-09-14 03:19 GMT

ఈనెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. అయితే ఈ సమావేశాల అజెండా ఏమిటన్నది కేంద్రం విడుదల చేయకపోవడంతో విపక్షాల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు బుధవారం అజెండాను విడుదల చేసింది. విధాన్ సభ నుంచి మొదలుకొని 75 సంవత్సరాల భారత పార్లమెంటరీ ప్రస్థానంపై తొలిరోజున చర్చ చేపట్టనున్నట్లు వెల్లడించింది. అలాగే భారత్ సాధించిన అనుభవాలు, జ్ఞాపకాలు, నేర్చుకున్న అంశాలు వంటి వాటిపై చర్చకు రానున్నట్లు తెలిపింది. అంతేకాదు రాజ్యసభలోని మూడు బిల్లులు, లోక్ సభలో నాలుగు బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపిన కేంద్రం.. ఇందుకు సంబంధించి లోక్‌సభ, రాజ్యసభ సచివాలయాలు వేరువేరుగా బులెటిన్ విడుదల చేశాయి. అలాగే ఈ జాబితా తాత్కాలికమేనని.. మరికొన్ని అంశాలను చేర్చే అవకాశాలు ఉన్నట్లు తెలిపాయి. 18వ తేదిన పాత పార్లమెంట్ భవనంలో సమావేశాలు ప్రారంభం కానున్నట్లు తెలిపింది.

కాగా, 19వ తేదీ గణేష్‌ చవితిని పురస్కరించుకుని నూతన పార్లమెంటు భవనంలో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో.. జమిలి ఎన్నికలు, దేశం పేరు మార్పు, మహిళా బిల్లు, ఉమ్మడి పౌరస్మృతి వంటి కీలక బిల్లులను తీసుకురానున్నట్లు ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశాలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ అంశాలపై స్పందించలేదు. మరోవైపు కేంద్రం వ్యూహాత్మకంగానే ఈ అంశాల ప్రస్తావన అజెండాలో తీసుకురావడంలేదని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల ఇండియా పేరును భారత్‌గా మార్పు, జమిలి ఎన్నికల అంశాలను కేంద్రం తెరపైకి తీసుకొచ్చే అవకాశాలున్నాయి.

నాలుగు బిల్లులు చర్చకు..

ఇదిలా ఉండగా, లోక్‌సభలో మొత్తం నాలుగు బిల్లులు చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. ఇందులో అడ్వకేట్స్‌ (సవరణ) బిల్లు- 2023, ది ప్రెస్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ పీరియాడికల్‌ బిల్లు-2023లను గతంలో రాజ్యసభ ఆమోదించింది. అయితే లోక్‌సభ నుంచి ఆమోదం పొందడం కోసం వీటిని లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే పోస్ట్‌ ఆఫీస్‌ బిల్లు-2023, చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ అండ్‌ ఎలక్షన్‌ కమిషనర్స్‌ (అపాయింట్‌మెంట్‌, కండిషన్స్‌ ఆఫ్‌ సర్వీస్‌ అండ్‌ టెర్మ్‌ ఆఫ్‌ ఆఫీస్‌) బిల్లు-2023లను ఈ ఏడాది ఆగస్టు 10న రాజ్యసభలో ప్రవేశపెట్టారు. కానీ వీటిని రాజ్యసభ ఆమోదించలేదు. ఈ రెండు బిల్లులను లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదించుకోవాలని కేంద్రం భావిస్తోంది.


Tags:    

Similar News