ఈ రైలుకు ఉన్న ఆదరణ అంతింత కాదయా?
గత ఏడాది అత్యధికంగా రైల్వే శాఖకు ఆదాయాన్ని సంపాదించిన రైలు హజ్రత్ నిజాముద్దీన్ - బెంగళూరు ఎక్స్‌ప్రెస్
రైలు ప్రయాణమంటే అదొక అనుభూతి. ఆనందం. మాటల్లో చెప్పలేని అనుభవం. అలాంటి రైలు ప్రయాణం చేయని వారు చాలా తక్కువ మంది ఉంటారు. అత్యధిక జనాభా ఉన్న భారతదేశంలో ఎక్కువ మంది దూర, దగ్గర ప్రాంతాలకు చేరుకునేందుకు రైలు మార్గాన్నే ఎంచుకుంటారు. ఎందుకంటే తక్కువ ఖర్చుతో సుఖవంతమైన ప్రయాణం చేసే అవకాశముంది. అందుకే మన దేశంలో రైళ్లకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఆధ్యాత్మిక క్షేత్రాల నుంచి పర్యాటక ప్రాంతాల సందర్శనకు మాత్రమే కాకుండా రోజువారి ప్రయాణానికి 70 శాతం మంది రైళ్లనే ఆశ్రయిస్తుంటారు.
అత్యధిక ఆదాయాన్ని తెచ్చిన....
దీంతో రైల్వే శాఖ కూడా వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను చేరవేయడానికి వాటి సంఖ్యను కూడా పెంచుతూ వస్తుంది. అయితే గత ఏడాది అత్యధికంగా రైల్వే శాఖకు ఆదాయాన్ని సంపాదించిన రైలు మాత్రం ఒకటుంది. అదే హజ్రత్ నిజాముద్దీన్ - బెంగళూరు మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలు. గత ఏడాది ఆర్థిక సంవత్సరంలో 5,09,510 మంది ప్రయాణికులు ఈ రైలులో ప్రయాణించారు. తద్వారా రైల్వే శాఖకు 1.76,06,66,339 రూపాయల ఆదాయం లభించింది. ఈ రైలుకు ఉన్న ఆదరణ అంతింత కాదయా? అంటూ రైల్వే శాఖ అధికారులు సంబరపడిపోతున్నారు.