Floods : వరదలతో అల్లాడుతున్న ప్రజలు.. సర్వస్వం పోగొట్టుకుని కట్టు బట్టలతో మిగిలి?
ఉత్తర భారత దేశంలో భారీ వర్షాలు జనజీవనం అతలాకుతలం చేస్తున్నాయి. వరదలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు
ఉత్తర భారత దేశంలో భారీ వర్షాలు జనజీవనం అతలాకుతలం చేస్తున్నాయి. వరదలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అసోం, ఉత్తరాఖండ్ లో వరదలతో భారీ గా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. అసోంలో వరదల కారణంగా 62 మంది మరణించారని అధికారులు తెలిపారు. భారీ వర్షాలతో అసోం రాష్ట్రంలోని 29 జిల్లాల్లో లక్షల మంది నిరాశ్రయులయ్యారు. నిరాశ్రయులైన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి వారిని పునరావాస కేంద్రంలో ఉంచారు. సర్వం నీటిపాలు కాగా, కట్టుబట్టలతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వరదల పరిస్థితి భయానకంగా ఉంది. వరదల దెబ్బకు అనేక మంది జీవితాలు అతలాకుతలమయ్యాయి. ఆస్తులు నీటిలో కొట్టుకుపోయాయి.
అసోంలో....
వరద సహాయక కార్యక్రమాలను ఉన్నతాధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. గవర్నర్ గులాబ్ చంద్ కటారియా వరద పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలను జారీ చేస్తున్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా నేరుగా వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ పరిస్థిితిని సమీక్షిస్తున్నారు. మొత్తం 29 జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టించాయని అధికారులు చెబుతున్నారు. వేలాది ఎకరాల పంటనీట మునిగింది. అనేక నదులు ప్రమాదక స్థాయికి మించి ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించారు.
ఉత్తరాంఖండ్ లో...
బ్రహ్మపుత్ర, ఉపనదులు పొంగిప్రవహిస్తుండటంతో అనేక జిల్లాల్లో ఆస్తి నష్టం ఎంత అన్నది అంచనాకు ఇంకా అందడం లేదు. ఉత్తరాఖండ్ లోనూ వరదల కారణంగా అనేక ఇళ్లు, కార్లునీళ్లలో కొట్టుకుపోయాయి. అలకానంద నది పొంగి ప్రవహిస్తుండటంతో దాదాపు వంద రహదారులను ఉత్తరాఖండ్ లో మూసివేశారు. నదులు అన్నీ ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తుండటంతో అనేక జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ఎవరూ లోతట్టు ప్రాంతాల్లో ఉండకుండా చర్యలు తీసుకున్నారు. పర్యాటకులు కూడా వరదల్లో చిక్కుకుని అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. మరో వారం రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.