Dana Cyclone Effect : బీభత్సం సృష్టిస్తున్న దానా తుపాను.. ఆరు లక్షల మంది తరలింపు

దానా తుపాను ఎఫెక్ట్‌తో ఒడిశాలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ఆరు లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Update: 2024-10-25 04:22 GMT

దానా తుపాను ఎఫెక్ట్‌తో ఒడిశాలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో ఆరు లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఒడిశా తీర ప్రాంతం మాత్రం వణుకుతోంది. భువనేశ్వర్, కోల్‌కత్తా ఎయిర్ పోర్టులను కూడా మూసివేశారంటే పరిస్థితి తీవ్రత ఎంతో అర్థమవుతుంది. దానా తుపాను తీరం దాటడంతో అర్థరాత్రి నుంచి భారీ వర్షాలు ఒడిశా, పశ్చిమ బెంగాల్ లో పడుతున్నాయి. దానా తుపాను ఒడిశా వద్ద తీరం దాటడంతో ఆ రాష్ట్రం ఎక్కువగా ఎఫెక్ట్‌ అవుతుంది. దాదాపు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంతో చెట్లు నేలకొరగాయి. విద్యుత్తు స్థంభాలు విరిగిపడ్డాయి.

విద్యుత్తు సరఫరా నిలిపి...
దీంతో ఒడిశాలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. తీర ప్రాంతంలోని ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను తీరం దాటినా దీని ప్రభావంతో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తడంతో ఇళ్లు నీటిలో మునిగిపోవడంతో ప్రజలను అక్కడి నుంచి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బయటకు తీసుకు వచ్చి పునరావాస కేంద్రాలకు తరలించారు.
పునరావాస కేంద్రంలో...
ఈరోజు, రేపు కూడా మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసర పనులు ఉంటే తప్ప ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆరు లక్షల మంది బాధితులకు ఆహార పొట్లాలను అందచేస్తున్నారు. స్వచ్ఛంద సేవాసంస్థలు కూడా చేయూతను అందిస్తున్నాయి. పునరావాస కేంద్రాల్లో మంచినీరు, అల్పాహారం భోజనం ఏర్పాట్లను చేస్తున్నారు. దీంతో ఒడిశాలో పరిస్థితి తీవ్రత ఎక్కువగా ఉందని, పంట నష్టం కూడా ఎక్కువగా జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అనేక చోట్ల రోడ్లు తెగిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.


Tags:    

Similar News