Champai Soren : కుటుంబ సభ్యుడు కాకపోయినా .. ఈయనకు సీఎం పదవి ఎందుకు ఇచ్చారంటే?

ఝార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో చంపై సోరెన్ సీఎం కానున్నారు.

Update: 2024-02-01 02:52 GMT

ముఖ్యమైన పదవి..అందులో ముఖ్యమంత్రి పదవి రావడం అంటే ఆషామాషీ కాదు. అందులోనూ ప్రాంతీయ పార్టీలలో ఆ పార్టీ వ్యవస్థాపక కుటుంబాలనే ఈ పదవి వరిస్తుంది. కుటుంబ సభ్యులను కాదని బయట వారికి ముఖ్యమంత్రి పదవి దక్కడం రాజకీయాల్లో అరుదైన విషయం. అందులోనే నేటి రాజకీయాల్లో అది జరగని పని. ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంపై సోరెన్ అంతే. కుటుంబ సభ్యుడు కాకపోయినా ఆయనకు పదవి వరించింది. అయితే అదృష్టమనుకోవాలా? లేక అలా కలసి వచ్చిందని చెప్పాలా? తెలియదు కాని.. అనుకోకుండానే చంపై సోరెన్ ముఖ్యమంత్రి అయ్యారు.

భార్యను చేయాలనుకున్నా...
ఝార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. ఆయన భూ కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈడీ అధికారులు గత కొద్ది రోజులుగా విచారిస్తుండంతో తన అరెస్ట్ ఖాయమని భావించి హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఝార్ఖండ్ ముక్తి మోర్చాలో ఆయన తర్వాత ఎవరు? అన్న దానికి నిన్న మధ్యాహ్నం వరకూ కల్పనా సోరెన్ పేరే ప్రముఖంగా వినిపించింది. హేమంత్ సోరెన్ తన భార్యను ముఖ్యమంత్రి పీఠం పై కూర్చోపెట్టాలనుకున్నారు. ప్రచారం కూడా అదే స్థాయలో జరిగింది. ఆమె పేరే ఫైనల్ అవుతుందని అనుకున్నారు.
కుటుంబంలో తలెత్తిన...
కానీ అది సాధ్యపడలేదు. చివరి నిమిషంలో మారింది. కుటుంబంలో విభేదాలు తలెత్తాయి. హేమంత్ సోరెన్ వదిన సీతా సోరెన్ అందుకు అభ్యంతరం తెలిపారు. ఎటువంటి రాజకీయ అనుభవం లేని కల్పానా సోరెన్‌కు ముఖ్యమంత్రి పదవి ఇస్తారని ప్రశ్నించారు. తాను పథ్నాలుగు ఏళ్లుగా ఎమ్మెల్యేనని, తాను ఎందుకు కాకూడదని ఆమె నేరుగా ప్రశ్నించారు. ఇలాగయితే కుదరదంటూ ఒకరకంగా వార్నింగ్ ను హేమంత్ సోరెన్ కు పంపించారు. ప్రశ్నించడమే కాదు బహిరంగంగానే నిలదీయడంతో హేమంత్ సోరెన్ కు ఊపిరి ఆడలేదు. పైగా హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ ఎమ్మెల్యే కూడా కాదు. దీంతో ఆయన దిగిరావాల్సి వచ్చింది.
తొలి నుంచి ఉన్న...
దీంతో పార్టీలో సీనియర్ నేత చంపై సోరెన్ ను పార్టీ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. అయిష్టంగానే హేమంత్ సోరెన్ ఒప్పుకుని అరెస్టయి వెళ్లిపోయారు. ఇంతకీ చంపై సోరెన్ వారి తండ్రి జేఎంఎం అధినేత శిబు సోరెన్ తో కలసి పనిచేశారు. పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు. హేమంత్ సోరెెన్ కుటుంబానికి నమ్మకమైన వ్యక్తిగాఉన్నారు. సరైకేలా - ఖార్సావాన్ జిల్లాకు చెందిన చంపై సోరెన్ అయితే బాగుంటుందని సూచించడంతో ఆయనను ఎంపిక చేశారు. ఆయన మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా పదవి దక్కడానికి సులువుగా మారింది. ఆయన త్వరలోనే ఝార్ఖండ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్నారు.


Tags:    

Similar News