రెడ్ అలర్ట్.. 1500 ఎకరాల్లో పంటనష్టం, స్కూళ్లకు సెలవు

భారీ వర్షాల నేపథ్యంలో చెన్నైతో పాటు చెంగల్ పట్టు, కాంచీపురం, తిరువల్లూరు, వేలూరు, రాణిపేట్ జిల్లాల్లో

Update: 2023-06-19 08:43 GMT

imd red alert to assam

దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్ లో తీరం దాటిన బిపోర్ జాయ్ తుపాను మరింత బలహీనపడి వాయుగుండంగా మారింది. దీనిప్రభావంతో ప్రస్తుతం రాజస్థాన్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు తమిళనాడు, అస్సాం రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరంలో, శివారు ప్రాంతాల్లో ఆదివారం నుంచీ కురుస్తున్న వర్షాలతో ఎండల నుంచి ఉపశమనం లభించినా.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అండర్ పాస్ లలోకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలులకు చెట్లు నేలకూలాయి.

భారీ వర్షాల నేపథ్యంలో చెన్నైతో పాటు చెంగల్ పట్టు, కాంచీపురం, తిరువల్లూరు, వేలూరు, రాణిపేట్ జిల్లాల్లో సోమవారం స్కూళ్లకు సెలవు ప్రకటించారు. అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్ వే పై నీరు చేరడంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 10 విమానాలను బెంగళూరుకు మళ్లించగా.. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. మరోవైపు రాజస్థాన్ లో కురుస్తున్న భారీవర్షాలకు వరదలు సంభవిస్తున్నాయి. బర్మేర్, సిరోహి, జలోర్ లలో ప్రాంతాలు నీటమునిగాయి. అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రాజస్థాన్ లో భారీ వర్షాలకు ఇప్పటి వరకూ ఐదుగురు మృతి చెందారు.
అస్సాంను కూడా వరదలు ముంచెత్తాయి. ఆదివారం అర్థరాత్రి నుంచీ ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జూన్ 22 గురువారం వరకూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. వాతావరణశాఖ అస్సాంకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వరదముప్పు పొంచి ఉన్న వివిధ ప్రాంతాల నుంచి 34 వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 142 గ్రామాలు జలదిగ్భంధంలో ఉన్నాయి. 1500 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. నిన్న సిక్కింలో కొండచరియలు విరిగిపడి పర్యాటకులు చిక్కుకుపోగా.. సహాయక చర్యలు నిర్వహించి వారిని కాపాడారు.


Tags:    

Similar News