Chennai Rains : ఫ్లై ఓవర్లపై కార్లు.. పార్క్ చేసి వెళ్లి పోతున్న జనం..భారీవర్షాల ఎఫెక్ట్
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరంతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలతో అధికారులు అప్రమత్తమయ్యారు
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై నగరంతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. గత మూడు రోజుల నుంచి తమిళనాడు వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. అనేకచోట్ల లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులుపడుతున్నారు. సబ్ వేల కూడా వర్షపు నీటితో నిండిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కొన్ని జిల్లాల్లో రెడ్అలెర్ట్, మరికొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్ ను అధికారులు జారీ చేశారు.
భారీ వర్షాలతో...
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం చెన్నై - పుదుచ్చేరి మధ్య తీరం దాట వచ్చని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ప్రజలు తమ కార్లను ఫ్లైఓవర్లపై పార్క్ చేస్తున్నారు. గతంలో కురిసిన భారీ వర్షాలకు కార్లు అన్ని వర్షపు నీటితో నిండిపోయి మరమ్మతులు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోసారి భారీ వర్ష సూచనతో ప్రజలు తమ కార్లను ఫ్లై ఓవర్లపై పార్క్ చేసి వెళ్లిపోతున్నారు. అనేక మంది ఇలా పార్క్ చేయడంతో ఫ్లై ఓవర్ పై ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు సీరియస్ అయ్యారు. పార్క్ చేసిన వాహనాలకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు.