బ్రిజ్ భూషణ్ పై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు : ఎమ్మెల్సీ కవిత
దేశభక్తితో మహిళా రెజ్లర్లు కష్టపడి, ఎంతో నిబద్ధతతో, తమ ప్రతిభతో బంగారు పతకాలు తీసుకొస్తే.. కేంద్ర ప్రభుత్వం వారి..
రెజ్లర్లను లైంగికంగా వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. కొంతకాలంగా దేశరాజధానిలో రెజ్లర్లు తమకు న్యాయం చేయాలంటూ నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు. అయినా వారిని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న కేంద్రం తీరుపై కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇప్పటికై కళ్లు తెరిచి రెజ్లర్లు లేవనెత్తుతున్న అంశాలను పరిగణలోకి తీసుకుని, తగిన పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
దేశభక్తితో మహిళా రెజ్లర్లు కష్టపడి, ఎంతో నిబద్ధతతో, తమ ప్రతిభతో బంగారు పతకాలు తీసుకొస్తే.. కేంద్ర ప్రభుత్వం వారి సమస్యలపై స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. బ్రిజ్ భూషణ్ పై పోస్కో వంటి తీవ్రమైన అభియోగాలు ఉన్నా.. అతడు ఎంతో స్వేచ్ఛగా బయటతిరుగుతున్నాడని మండిపడ్డారు. దేశానికి బంగారు పతకాలు సాధించిన మహిళా క్రీడాకారుల పట్ల అనుచితంగా వ్యవహరించిన బ్రిజ్ భూషణ్ పై వెంటనే కఠినచర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ప్రపంచం మొత్తం రెజ్లర్ల ఆవేదనను చూస్తోందని, ప్రజలంతా దీనికి సమాధానం కోరుకుంటున్నారని అన్నారు. ఇప్పటికైనా కేంద్రం కళ్లు తెరిచి బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు.