మాస్క్ లు పెట్టుకోవాల్సిందే: ప్రభుత్వం సూచన
కేరళలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతూ ఉన్న కారణంగా కర్ణాటక రాష్ట్రం
కేరళలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతూ ఉన్న కారణంగా కర్ణాటక రాష్ట్రం కూడా అప్రమత్తమైంది. కర్ణాటక ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దినేష్ గుండూరావు సోమవారం నుండి సీనియర్ సిటిజన్లు, ఇతర అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నవారు మాస్కులు ధరించాలని సూచించారు. కేరళ, ఇతర రాష్ట్రాల్లో కోవిడ్ -19 కేసులు పెరిగిన తరువాత ఆయన ఈ సూచనలు చేశారు. కర్ణాటకలోని కొడగులో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతానికైతే భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుత పరిస్థితిపై ఒక సమావేశం నిర్వహించాము, ఆ సమావేశంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించాము. 60 ఏళ్లు పైబడిన వారు, గుండె సమస్యలు ఉన్నవారు.. ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని సూచించారు.
“ప్రభుత్వ ఆసుపత్రులను సిద్ధంగా ఉండాలని మేము కోరాము. కేరళతో సరిహద్దును పంచుకునే ప్రాంతాలు మరింత అప్రమత్తంగా ఉండాలి. మంగళూరు, చామనాజ్‌నగర్, కొడగులు ప్రాంత అధికారులు అప్రమత్తంగా ఉండాలి. పరీక్షలను పెంచుతాం. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవలసి ఉంటుంది, ”అన్నారాయన. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, కోవిడ్ సబ్-వేరియంట్ JN.1 ఇటీవల కేరళలో బయటపడింది. ఈ వేరియంట్ కారణంగా కేరళలో ఒక మరణం కూడా నమోదైంది. భారతదేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య సోమవారం నాటికి 1,828కి పెరిగింది.