G-20: జీ-20 సమ్మిట్‌ అంటే ఏమిటి..? అందరి చూపు ఢిల్లీ వైపే

ఇప్పుడు ప్రపంచమంతా ఢిల్లీ వైపే ఉంది. అందరి కన్ను ఢిల్లీ మీదే. ఏంటి ఢిల్లీలో అంత ప్రత్యేకత ఏంటనుకుంటున్నారా..?..

Update: 2023-09-08 03:45 GMT

ఇప్పుడు ప్రపంచమంతా ఢిల్లీ వైపే ఉంది. అందరి కన్ను ఢిల్లీ మీదే. ఏంటి ఢిల్లీలో అంత ప్రత్యేకత ఏంటనుకుంటున్నారా..? అదే జీ20 సమావేశాలు. లక్షకుపైగా ప్రత్యేక పోలీసు బలగాలతో భద్రత ఉంది. జీ 20 సమావేశాలు ఢిల్లీ వేదికగా జరుగనున్నాయి. అయితే జీ-20 అంటే ఏమిటనేది చాలా మందికి తెలియకపోవచ్చు. జీ 20 అంటే గ్రూప్ 20 దేశాలని అర్ధం. ప్రపంచీకరణ తరువాత 19 అగ్రరాజ్యాలు, యూరోపియన్ యూనియన్ కలిసి 1999లో ఏర్పాటు చేసుకున్న గ్రూప్ ఇది. ఇందులో అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్ సహా అగ్రదేశాలన్నీ ఉన్నాయి. అందుకే అంతటి ప్రాధాన్యత జీ20 కు ఉందనే చెప్పాలి. ఈ దేశాలకు చెందిన ప్రముఖ నేతలు ఢిల్లీలో మకాం వేయనున్నారు. ఈ జీ -20 సమావేశాలో శని, ఆదివారాలు రెండు రోజుల పాటు జరుగనున్నాయి. ఇందు కోసం పలు దేశాలకు చెందిన అధ్యక్షులు, నేతలు రానుండటంతో భద్రత నిఘా నీడలో ఢిల్లీ ఉండిపోయింది.

జీ20ను ఒక విధంగా చెప్పాలంటే మినీ యూఎన్ఓగా చెప్పవచ్చు. ప్రపంచ జీడీపీలో 85 శాతం, ప్రపంచ జనాభాలో 70 శాతం ఈ దేశాల్నించే ఉండటం గమనార్హం. ఇందులో ఏకాభిప్రాయంతో తీసుకునే నిర్ణయాలపై ప్రధానంగా ప్రస్తావన ఉంటుంది. 1999లో ఆర్ధిక సంక్షోభం నేపధ్యంలో పరస్పర సహకారం కోసం జీ20 ఏర్పాటు అయ్యింది. ఆ తరువాత ఎజెండా మారింది. సమగ్రాభివృద్ధి, వాణిజ్యం, వ్యవసాయం, ఆరోగ్యం, ఇంధనం, పర్యావరణం, వాతావరణ మార్పులు, అవినీతి నిరోధక చర్యలు వంటి అంశాల్లో కూడా పరస్పర సహకారం ఉండాలని ఎజెండా మార్చుకున్నాయి.
జీ 20కు ఓ నిర్దిష్ట కార్యాలయం, హెడ్ క్వార్టర్స్ అంటూ లేవు. ఒక్కొక్క ఏడాది ఒక్కొక్క దేశానికి సారధ్య బాధ్యతలు ఉంటాయి. ఏ ఏడాది ఏ దేశానికి సారధ్య బాధ్యతలు లభిస్తే ఆ దేశంలో సమ్మిట్ జరుగుతుంది. 2020లో సౌదీ అరేబియా, 2021లో ఇటలీ, 2022లో ఇండోనేషియా జీ 20 సారధ్య బాద్యతలు నిర్వహించగా 2023 బాధ్యతలు ఇండియాకు దక్కాయి. 2022 డిసెంబర్ 1న ప్రారంభమైన ఇండియా సారధ్య బాధ్యతలు 2023 నవంబర్ 30 వరకూ ఉంటాయి. ఇందులో భాగంగానే సెప్టెంబర్ 9, 10 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో జీ20 సదస్సు జరగనుంది. ఇండియా తరువాత బ్రెజిల్ ఈ బాధ్యతలు తీసుకోనుంది.


Tags:    

Similar News