బతికుండగానే కర్మకాండ.. షాకిచ్చిన తండ్రి

వివరాల్లోకి వెళ్తే.. కెవానా గ్రామానికి చెందిన జఠాశంకర్ వయసు 60 ఏళ్లకు పైగానే. మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఏడుగురు..;

Update: 2023-06-17 05:51 GMT
man celebrates his peddakarma, uttarpradesh viral news

man celebrates his peddakarma

  • whatsapp icon

భూమిపై ఉన్న ప్రతి జీవికి ఏదొక రోజు మరణం సంభవిస్తుంది. మిగతా జీవుల సంగతి పక్కనపెడితే.. మనిషికి పుట్టేటపుడు లేని భయం.. చావంటే భయమేస్తుంది. బతికినన్నాళ్లు సంతోషంగా ఏ బాగరబందీ లేకుండా బతికితే చాలనుకుంటారు కొందరు. మరికొందరు మాత్రం లేనిపోని ఆలోచనలతో పిచ్చిపనులు చేస్తుంటారు. అలా ఓ తండ్రి తాను చనిపోయాక పిల్లలు తనకు పెద్దకర్మ నిర్వహిస్తారో లేదోనని మదనపడి.. తనకు తానుగానే కర్మకాండ జరిపించుకున్నాడు. సమాధి కట్టించుకున్నాడు. ఊరందరికీ భోజనాలు కూడా పెట్టాడు. ఆ పెద్దమనిషి చేస్తున్నదంతా చూసి షాకయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్ జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. కెవానా గ్రామానికి చెందిన జఠాశంకర్ వయసు 60 ఏళ్లకు పైగానే. మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఏడుగురు సంతానం. ఇప్పటికి ఆరోగ్యంగానే ఉన్నా.. తాను చనిపోతే పిల్లలు తనకు చేయాల్సిన కర్మకాండలు జరిపిస్తారో లేదోనన్న బెంగ మొదలైంది అతనికి. అలా ఆలోచిస్తూ ఉంటే లాభం లేదనుకున్నాడు. గురువారం (జూన్15) రాత్రి చుట్టాలుపక్కాలతో పాటు గ్రామస్థులందరినీ పిలిచి తన పెద్దకర్మను తానే నిర్వహించుకున్నాడు. వచ్చిన 300 మందికి స్వయంగా విందు భోజనం వడ్డించాడు. తనకు ఎవరి మీదా నమ్మకం లేదని, అందుకే ఈ కార్యక్రమానికి పూనుకున్నట్టు చెప్పాడు. బతికి ఉండగానే పెద్దకర్మ నిర్వహించడం మన ఆచారం కాదని తెలిసినా చేయకతప్పలేదని జఠాశంకర్ చెప్పుకొచ్చాడు. మూడేళ్ల క్రితమే తన వ్యవసాయ క్షేత్రంలో సమాధి సిద్ధం చేసుకున్నాడు. కొన్ని వారాల క్రితమే తనకు తానే పిండం కూడా పెట్టుకున్నాడు. ఈ షాక్ నుంచి గ్రామస్తులు తేరుకోకుండానే పెద్దకర్మ చేసుకుని మరో షాకిచ్చాడు.


Tags:    

Similar News