కెమికల్ లో ముంచగానే తాజా ఆకుకూరల్లా ఎలా కనిపిస్తున్నాయో చూడండి
తాజాగా కనిపించే కూరగాయలు, ఆకుకూరల వెనుక ఎంత దారుణం జరుగుతుందో తెలిపే వీడియో ఇది. వేసవిలో వచ్చే మామిడిపండ్లను..
తెల్లనివన్నీ పాలు కావు.. నల్లనివన్నీ నీళ్లు కావు అనే సామెత గుర్తుందా ? ఈ వీడియో చూస్తే అదే గుర్తొస్తుంది. తాజాగా కనిపించే కూరగాయలు, ఆకుకూరల వెనుక ఎంత దారుణం జరుగుతుందో తెలిపే వీడియో ఇది. వేసవిలో వచ్చే మామిడిపండ్లను చెట్టు నుంచి పచ్చిగా ఉన్నప్పుడే కోసి మాగబెట్టేందుకు, పండ్లు పాడవ్వకుండా ఉండేందుకు కెమికల్స్ వాడుతారని అందరికీ తెలిసిందే. అలాగే ఇప్పుడు కూరగాయలు కూడా తాజాగా కనిపించేలా రసాయనద్రావణంలో కడిగి పెడుతున్నారు.
ఈ వీడియో ఎక్కడ తీశారు ? ఏ ప్రాంతమో తెలీదు కానీ.. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వాడిపోయిన ఆకులను రసాయనంలో ముంచిన కొద్దిసేపటికి కెమికల్ ఎఫెక్ట్ తో అవి విచ్చుకుంటున్నాయి. అప్పుడే తీసుకొచ్చినట్లుగా తాజాగా మారిపోతున్నాయి. తాజా ఆకుకూరలు తింటే ఆరోగ్యానికి మంచిదని నమ్మిన వారంతా ఇలాంటివాటిని కొని మరీ అనారోగ్యాన్ని తెచ్చుకునే ప్రమాదం లేకపోలేదు. అమిత్ తధాని అనే వ్యక్తి ‘రెండు నిమిషాల నిజ జీవిత భయానక కథ’ అని పేర్కొంటూ.. ఆ వీడియోని ట్వీట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా నిజంగా భయానకంగానే ఉందని కామెంట్లు చేస్తున్నారు. కొందరు నెటిజన్లైతే ఇది 2021లో వైరల్ అయిన వీడియో అని చెబుతున్నారు.