600 కోట్ల రూపాయల ఆస్తిని ప్రభుత్వానికి రాసిచ్చేసిన డాక్టర్
600 కోట్ల రూపాయల ఆస్తిని ప్రభుత్వానికి రాసిచ్చేసిన డాక్టర్
సంపాదించడం గొప్ప కాదు.. సంపాదించిన డబ్బును ఇతరుల కోసం ఉపయోగించడం ముఖ్యం. అలాంటి కోవకే చెందిన వాడు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మొరాదాబాద్‌కు చెందిన అరవింద్ గోయల్ అనే వైద్యుడు. ఆయన పేదలకు సహాయం చేయడానికి తన ఆస్తి మొత్తాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు. మొత్తం ఆస్తి విలువ దాదాపు రూ.600 కోట్లు ఉంటుంది. ఆయన గత 50 సంవత్సరాలుగా వైద్యుడిగా విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆస్తిని దానం చేయాలని దాదాపు 25 ఏళ్ల క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
లాక్‌డౌన్ సమయంలో మొరాదాబాద్ చుట్టుపక్కల 50 గ్రామాలను దత్తత తీసుకుని అరవింద్ కుమార్ గోయల్.. ప్రజలకు ఎన్నో సౌకర్యాలు కల్పించారు. రాష్ట్రంలోని పేదలకు ఉచిత విద్య, మెరుగైన వైద్యం కూడా ఆయన ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ రాష్ట్రపతి ప్రతిభా దేవి పాటిల్, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సహా డాక్టర్ గోయల్‌ను పలువురు సత్కరించారు. అరవింద్‌కు భార్య రేణు గోయల్‌తో పాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆస్తి అసలు ధరను లెక్కించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తారు.