రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కొత్త టెక్నాలజీ
భారత్‌లో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు
భారత్‌లో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రమాదాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రమాదాలను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలన్నదానిపై కేంద్రం దృష్టి సారిస్తోంది. తాజాగా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ శాఖ చేసిన సర్వేలో మితిమీరిన వేగంతో వెళ్లడమే ప్రమాదాలకు కారణంగా తెలిసింది. రోడ్డుపైన స్పీడ్ లిమిట్ ను సూచించే బోర్డులు ఉన్నప్పటికీ వాటిని ఎవరూ పాటించడంలేదు. స్పీడ్ గన్స్ పెట్టినప్పటికీ పెద్దగా ఫలితం ఉండటం లేదు. నెంబర్ ప్లేట్లు మార్చి.. స్పీడ్ గన్ ను ఏమార్చి మరీ దూసుకెళ్తున్నారు కొందరు. వీటన్నిటికీ చెక్ పెట్టే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. సరికొత్త టెక్నాలజీని నేషనల్ హైవేల పై ప్రవేశపెట్టనుంది.
ప్రతి వాహనం ప్రభుత్వం సూచించిన స్పీడ్ లిమిట్ లో వెళ్లాల్సిందే. స్పీడ్ లిమిట్ దాటి వాహనాలు నడిపితే మధ్యలో టోల్ గేట్‌వద్ద ఆ వాహనాన్ని నిలిపివేస్తారు. అక్కడ స్పీడ్ లిమిట్‌ను అతిక్రమించినందుకు భారీగా ఫైన్ చెల్లించుకోవలసి ఉంటుంది. రోడ్ సేఫ్టీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏఐ టెక్నాలజీని ఉపయోగించబోతోంది. అంతేకాదు, వాహనదారులకు టోల్ ఫీజు కూడా తగ్గించబోతున్నారు. దీంతో ఎంత దూరం ప్రయాణిస్తే అంత దూరమే టోల్ ఫీజు కట్టే వెసులుబాటు కల్పిస్తున్నారు. ఇప్పటివరకూ హైదరాబాదునుంచి విజయవాడకు వెళుతున్నట్టయితే, మొత్తం మూడు టోల్ ప్లాజాల్లో ఫీజు కడతారు.
కానీ కేవలం నల్లగొండ వరకూ మాత్రమే వెళ్లే వాళ్ళు కూడా చౌటుప్పల్ వద్ద టోల్ ఫీజు కట్టాల్సివస్తోంది. కానీ, ఇప్పుడు ఈ భారం తప్పుతుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఎంత దూరం ప్రయాణిస్తే అంతే టోల్ ఫీజు కట్టే సదుపాయం అందుబాటులోకి రానుంది. నేషనల్ హైవేలపై ప్రతి 25 కిలోమీటర్ల కి ఒక సెన్సార్ ను ఏర్పాటు చేయబోతున్నారు. వాహనాలను స్కాన్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ద్వారా వెళుతున్న వేగాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి ఫీజును కట్ చేస్తాయి.
తిరుపతి కొండ పైన ఎలాంటి నిబంధనలు ఉన్నాయో.. అలాంటివే ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేయనున్నారు. కొండ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొంత టైం లిమిట్ ఉంది. టైం లిమిట్‌కు ముందే వస్తే ఫైన్ వేస్తారు. అలాగే హైదరాబాద్ నుంచి వరంగల్ కి 80 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్తే రెండు గంటల 45 నిమిషాలు పడుతుంది. అంతకన్నా ముందు చేరితే టోల్ ప్లాజా లో వాహనాన్ని ఆపేసి ఫైన్ చెల్లించుకోవాల్సిందే. నేషనల్ హైవేల పై ఈ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌అమలులోకి వస్తే 60 శాతానికి పైగా యాక్సిడెంట్లు తగ్గిపోతాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఇలాంటి టెక్నాలజీతో ప్రమాదాలను అరికట్టవచ్చని కేంద్రం భావిస్తోంది.