మార్చిలోనే ఠారెత్తిస్తోన్న ఎండలు.. ఇక ముందు ముందు చుక్కలే !
దైవభూమిగా చెప్పుకునే కేరళలోని కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు35-37 డిగ్రీలు ఉన్నా.. 54 డిగ్రీల ఎండకాచినట్టుగా అనిపిస్తోంది.
వేసవి మొదలై రెండు వారాలవుతోంది. దేశంలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఉదయం వేళ పొగమంచు ఉన్నా.. కాసేపటికీ సూర్యుడు మండుతూ వస్తున్నాడు. గతానికి భిన్నంగా.. ఈ ఏడాది ఎండలు ఠారెత్తిస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. మార్చిలోనే ఎండలు మండిపోతుంటే.. ఏప్రిల్, మే నెలల్లో పట్టపగలే చుక్కలు కనిపించడం ఖాయం. మార్చి రెండోవారంలోనే మాడు పగలే ఎండలు కాస్తుంటే.. ముందు ముందు పరిస్థితి ఎలా ఉండబోతుందో ఒక అంచనాకి రావొచ్చు.
దైవభూమిగా చెప్పుకునే కేరళలోని కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 35 నుండి 37 వరకు నమోదవుతున్నా.. 54 డిగ్రీల ఎండ కాచినట్లు ఉందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. అధిక ఎండలకు, ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల అనారోగ్యం, వడదెబ్బ అవకాశాలు ఎక్కువగా ఉండొచ్చని అంచనా. ఏప్రిల్ నెల వచ్చేనాటికి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను దాటవచ్చని తెలుస్తోంది.
తిరువనంతపురం జిల్లాలోని అలప్పుజా, కొట్టాయం, కన్నూర్ జిల్లాలలోని కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావటంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. తిరువనంతపురం, కొల్లం, అలప్పుజా, కొట్టాయం, ఎర్నాకులం, కోజికోడ్, కన్నూర్‌లోని ప్రధాన ప్రాంతాలలో కూడా గురువారం అధిక ఉష్ణోగ్రత నమోదైంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు బయటకు వెళ్లేటపుడు జాగ్రత్తగా ఉండాలని, ఎండ నుంచి రక్షించుకోవడంతో పాటు ఎక్కువ నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం, ఒంటికి చలువనిచ్చే వాటిని తాగాలని సూచిస్తున్నారు.