మహిళల కొలతలను మగవాళ్లు తీసుకోకూడదు.. జట్టును కత్తిరించడం కూడా!
అసభ్యకరంగా తాకుతూ దురుద్దేశంతో వ్యవహరించే వ్యక్తుల నుంచి
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మహిళా కమీషన్ సంచలన ప్రతిపాదనలను తీసుకొచ్చింది. మహిళలను చెడుగా తాకే వ్యక్తులకు సంబంధించి కొన్ని కీలక సూచనలను చేసింది. పురుషులు మహిళల కొలతలను తీసుకోకూడదని, వారి జుట్టును కూడా మగవాళ్ళు కత్తిరించకూడదని ప్రతిపాదించింది. ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ చీఫ్ బబితా చౌహాన్ మాట్లాడుతూ మహిళా క్లయింట్‌లను జిమ్‌లు తప్పనిసరిగా మహిళా శిక్షకులను నియమించాలని సూచించారు. జిమ్ ట్రైనర్లందరి పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి చేయాలని, ఒక మహిళ మగ ట్రైనర్ నుండి శిక్షణ పొందాలనుకుంటే, ఆమె వ్రాతపూర్వక సమ్మతిని అందించాలని చౌహాన్ చెప్పారు. అక్టోబరు 28న జరిగిన సమావేశంలో మహిళా సంఘం ఈ సూచనలు చేసింది. జిమ్‌లలో వేధింపులపై మహిళల నుంచి కమిషన్‌కు అనేక ఫిర్యాదులు అందాయని చౌహాన్ తెలిపారు.
కొలతలు తీసుకోవడానికి టైలరింగ్ దుకాణాలు తప్పనిసరిగా మహిళా టైలర్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, బాలికలను రవాణా చేసే పాఠశాల బస్సుల్లో తప్పనిసరిగా మహిళా సిబ్బంది ఉండాలన్నారు. కోచింగ్ సెంటర్లలో సీసీ కెమెరాల ఏర్పాటును కూడా ఆమె ప్రతిపాదించారు. కమిషన్ అన్ని జిల్లాలకు ప్రతిపాదనలు పంపింది. అసభ్యకరంగా తాకుతూ దురుద్దేశంతో వ్యవహరించే వ్యక్తుల నుంచి మహిళలకు రక్షణ కల్పించడానికే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ తెలిపింది. కొన్ని పనులు చేసే వ్యక్తులు మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లుగా ఇటీవలి కాలం ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని అంటున్నారు. ఈ నిబంధనలను అమలు చేయడం వల్ల మహిళలకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని అంటున్నారు మహిళా కమిషన్ సభ్యులు.