రైల్వే పోర్టర్‌గా మారిన రాహుల్
రాహుల్ గాంధీ ఇటీవల కాలంలో సామాన్యులతో మమేకమవుతున్నారు. రైల్వే పోర్టర్ గా మారారు
రాహుల్ గాంధీ ఇటీవల కాలంలో సామాన్యులతో మమేకమవుతున్నారు. అనేక సందర్భాల్లో ఆయన రైతులు, ట్రక్ డ్రైవర్లు, మోటార్ మెకానిక్ తదితర కార్మికులతో సమావేశమై వారి సమస్యలపై చర్చించారు. ప్రధానంగా భారత్ జోడో యాత్ర అనంతరం రాహుల్ గాంధీ సామాన్యుల్లో ఒకరిగా మారుతున్నారు. అంతేకాదు తన ఇంటికి పేద మహిళలను ఆహ్వానించి భోజనం పెట్టి మరీ పంపుతున్నారు.
రైల్వే స్టేషన్‌లో...
అలాంటి రాహుల్ గాంధీ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ కు వెళ్లి ఆయన సూట్‌కేసు మోశారు. రైల్వే పోర్టర్ అవతారమెత్తారు. అనంతరం వారితో సమావేశమై వారి సమస్యలపై చర్చించారు. పోర్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని దానికి ఎలాంటి పరిష్కారం దొరుకుతుందని కూడా ఆయన వారి నుంచే సూచనలు తీసుకున్నారు. రాహుల్ అంతటి నేత రైల్వే స్టేషన్ కు రావడంతో అక్కడ రైల్వే కూలీలంతా ఆశ్చర్యపోయారు.
పోర్టర్ల సమస్యలను తెలుసుకుని...
గత నెలలో రైల్వే పోర్టర్లు ఒక వీడియోను విడుదల చేశారు. తమ కష్టాలను తెలుసుకునేందుకు తమ వద్దకు రావాలంటూ రాహుల్ ను ఆహ్వానించారు. అయితే ఇప్పటి వరకూ రాహుల్‌కు కుదరలేదు. అయితే ఈరోజు ఉదయాన్నే ఆయన రైల్వే స్టేషన్ వద్దకు వెళ్లి పోర్టర్లను కలసి వారితో ముచ్చటించారు. వారు తమ కష్టాలను రాహుల్ గాంధీకి చెప్పుకున్నారు. అంతా విన్న రాహుల్ వారికి తగిన భరోసా ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలన్న భావనతో రాహుల్ సామాన్యులతో మమేకమవుతున్నారు.