పెరుగుతున్న రాహుల్ గాంధీ పాపులారిటీ.. ప్రధాని మోదీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తోందంటే?
వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలతో సహా వరుస ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రజలు ఎవరి వైపు మొగ్గుచూపుతున్నారో తెలుసుకోడానికి సర్వే చేపట్టారు
కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఆ పార్టీలో జోష్ ను ఊహించని విధంగా పెంచింది. కర్ణాటక కాంగ్రెస్ లీడర్లు అయిన డీకే శివకుమార్, సిద్ధరామయ్యల కారణంగా కాంగ్రెస్ పార్టీ గెలిచిందని అంటున్నా.. అందులో ఎంతో కొంత క్రెడిట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీకి కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ప్రధాని నరేంద్ర మోదీని ఢీకొట్టడానికి రాహుల్ గాంధీకి ఈ ఒక్క విజయమే సరిపోతుందా అంటే.. అది కూడా డౌట్. కానీ గత కొన్ని నెలలుగా రాహుల్ గాంధీకి కూడా పాపులారిటీ బాగా పెరుగుతూ ఉంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిందే..! తాజాగా నిర్వహించిన సర్వేలో కూడా ఈ విషయం బయటపడింది.
"పబ్లిక్ ఒపీనియన్" లోక్నీతి-సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (CSDS) భాగస్వామ్యంతో చేపట్టిన పబ్లిక్ ఒపీనియన్ లో ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా నిలిచారు. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తవుతున్నందున, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలతో సహా వరుస ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రజలు ఎవరి వైపు మొగ్గుచూపుతున్నారో తెలుసుకోడానికి సర్వే చేపట్టారు. మే 10-19 మధ్య 19 రాష్ట్రాలలో ఈ సర్వే నిర్వహించారు. 43% మంది బీజేపీ నేతృత్వంలోని NDA వరుసగా మూడోసారి గెలుపొందాలని అభిప్రాయపడ్డారు. 38% మంది విభేదిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి ఓటేస్తామని దాదాపు 40% మంది చెప్పారు. కాంగ్రెస్‌కు 29 శాతం ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. బీజేపీ ఓట్ల శాతం 2019 (37%) నుంచి 2023 (39%)కి పెరిగింది. కాంగ్రెస్ కూడా బాగా పుంజుకుంది. 2019లో 19% నుంచి 2023లో 29% పెరిగింది. ప్రధానమంత్రి పదవికి నరేంద్ర మోదీ సరైనవారని 43 శాతం మంది చెప్పారు. రాహుల్ గాంధీకి 27 శాతం మంది మద్దతు తెలిపారు. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ లకు 4 శాతం మంది మద్దతు తెలపగా, అఖిలేష్ యాదవ్ 3%, నితీష్ కుమార్ 1 శాతం మంది మద్దతు తెలిపారు. 2019,2023కి సంబంధించిన ప్రధానమంత్రి మోదీకి కాస్త పాపులారిటీ (44 నుంచి 43%) తగ్గిందని తెలుస్తోంది. రాహుల్ గాంధీకి (24 నుంచి 27%) కాస్త పాపులారిటీ పెరిగినట్లు సర్వే తెలిపింది.