16 నిమిషాల్లో మూడు భూకంపాలు.. వణికిపోయిన భారత్

రాజస్థాన్ లోని జైపూర్ లో శుక్రవారం తెల్లవారుజామున మూడుసార్లు భూమి కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం..

Update: 2023-07-21 03:20 GMT

jaipur, manipur earthquakes

ఓ వైపు యావత్ దేశాన్నీ భారీవర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వరదల బీభత్సం, మరికొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతుండటంతో.. పదులసంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారు. ఈ క్రమంలో వరుస భూకంపాలు దేశ ప్రజల వెన్నులో వణుకు పుట్టించాయి. మణిపూర్, రాజస్థాన్ లలో వరుస భూకంపాలు సంభవించాయి. రాజస్థాన్ లోని జైపూర్ లో శుక్రవారం తెల్లవారుజామున మూడుసార్లు భూమి కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. 16 నిమిషాల వ్యవధిలోనే మూడుభూకంపాలు సంభవించాయి. మొదటి భూకంపం ఉదయం 4.09 గంటలకు సంభవించగా.. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.4గా ఉంది.

రెండవ భూకంపం 4.22 గంటలకు 3.1తీవ్రతతో సంభవించగా.. మూడోసారి 4.25 గంటలకు సంభవించింది. దాని తీవ్రత 3.4గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మణిపూర్ లోని ఉఖ్రూల్ ప్రాంతంలో సంభవించిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.5గా నమోదైంది. 20 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంప దృశ్యాలు కొన్ని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. తెల్లవారుజామున భూమి ఊగుతున్నట్లు గమనించిన ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే.. వీటి వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. వరుస భూకంపాలపై రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే మాట్లాడుతూ.. జైపూర్ సహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో భూకంపం సంభవించిందని, అందరూ క్షేమంగా ఉన్నట్లు ఆశిస్తున్నానని తెలిపారు.


Tags:    

Similar News