Kerala Landslides : గల్లంతయిన వారి జాడేదీ? కొనసాగుతున్న సహాయక చర్యలు
కేరళలోని వాయనాడ్ లో కొండచరియలు విరిగి పడిన ఘటనలో సహాయక చర్యలు చివరి దశకు చేరుకున్నాయి
కేరళలోని వాయనాడ్ లో కొండచరియలు విరిగి పడిన ఘటనలో సహాయక చర్యలు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే 218 మంది మృతదేహాలను ఆర్మీ బృందాలు బయటకు తీశాయి. ఈరోజు, రేపటిలో సహాయక చర్యలు ముగిసే అవకాశముందని తెలిసింది. ఇప్పటికే అణువణువునూ ఆర్మీ, ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు గాలించాయి. అనేక మంది ఆచూకీ లభించడం లేదని ఫిర్యాదులు అందుతుండటంతో ఇంకా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
రెండు వందలకు మందికిపైగా...
గల్లంతయిన వారంతా బీహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వారుగా చెబుతున్నారు. వీరంతా టీ తోటల్లో పనిచేసేందుకు వచ్చి వరదల్లో గల్లంతయినట్లు తెలిసింది. 218 మంది మృతదేహాల్లో 87 మంది మహిళలవి ఉండగా, 30 మంది చిన్నారులన్నాయి. అయితే ఇంకా రెండు వందలకు మందికిపైగా ఆచూకీ తెలియడం లేదని చెబుతున్నారు. వీరు ఎక్కడ చిక్కుకున్నారు? తప్పించుకుని బయటకు వెళ్లారా? లేక శిధిలాల కింద ఉన్నారా? అన్నది మాత్రం తెలియరాలేదు.
జాతీయ విపత్తుగా...
అందుకోసమే చివరి సారిగా గల్లంతయిన వారి ఆచూకీ కనుగొనడం కోసం వాయుసేన నుంచి అత్యాధునిక రాడార్లను రప్పిస్తున్నారు. వీటితో గాలించిన తర్వాత చాలా వరకూ ఆచూకీ లభించే అవకాశముందని చెబుతున్నారు. మృతులను కూడా గుర్తించడం కష్టంగా మారింది. 67 మందిని గుర్తించలేకపోతున్నామని ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మాత్రం నిరంతరం సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. కొందరిని రక్షించారు. రక్షించిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేరళ విలయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలన్న డిమాండ్ వినపడుతుంది. కొండ చరియలు విరిగిపడిన ప్రాంత పరిధి ఎక్కువగా ఉండటంతో అంతటా పిన్ టు పిన్ వెతుకుతూ చివరి ప్రయత్నంలో ఆర్మీ, ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బంది ఉన్నారు.