రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు
భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ము కశ్మీర్ ప్రాంతాల్లో 12 మంది మరణించగా.. మృతుల్లో ఇద్దరు సైనికులు..
ఉత్తరాదిని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. నేడు రెడ్, రేపు ఆరెంజ్ అలర్టులు జారీ చేసింది ఐఎండీ. నిన్నటి నుంచి ఢిల్లీలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మరోవైపు ఐఎండీ 8 రాష్ట్రాలకు రెండురోజుల పాటు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో.. అత్యవసర విభాగాల్లో ఉద్యోగుల సెలవులను రద్దు చేసింది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ లోనూ విద్యాసంస్థలన్నింటికీ సెలవు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కాలేజీలన్నింటినీ మూసివేస్తున్నట్లు తెలిపింది.
ఉత్తరాఖండ్ లోనూ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. జులై 10 నుంచి 17 వరకూ కన్వర్ మేళా నేపథ్యంలో హరిద్వార్ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. తాజాగా భారీ వర్షాలు కురుస్తుండటంతో విద్యాసంస్థలకు అక్కడి ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. ఇప్పటి వరకూ.. భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ము కశ్మీర్ ప్రాంతాల్లో 12 మంది మరణించగా.. మృతుల్లో ఇద్దరు సైనికులు కూడా ఉన్నారు. ప్రముఖ పర్యాటక కేంద్రమైన మనాలీలో పార్కింగ్ ఉన్న కార్లు వరద ప్రవాహంలో బొమ్మల్లా కొట్టుకుపోయాయి. మండీ జిల్లాలో ఔట్- బంజార్ ప్రాంతాలను కలుపుతూ బియాస్ నది పై నిర్మించిన ఉక్కు వంతెన సైతం వరదలో కొట్టుకుపోయింది. మొత్తం 36 ప్రాంతాల్లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు. జమ్ము కశ్మీర్, ఢిల్లీ, కేరళ, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హర్యానా, లక్షద్వీప్ లకు ఐఎండీ భారీ వర్షసూచన చేసింది.