Sridhar Vembu : 18 వేల కోట్ల ఆస్తి ... అలా వదిలేసి ఇలా

పారిశ్రామికవేత్తగా ఎదిగిన శ్రీధర్ వెంబు తన పద్దెనిమిది వేల కోట్ల ఆస్తిని వదిలేసి గ్రామంలో సాదాసీదా జీవితం గడుపుతున్నారు

Update: 2023-10-25 06:29 GMT

కోటి రూపాయలుంటే ఇంకో కోటి రూపాయలు సంపాదించాలని ఆశ. రెండు కోట్లు వస్తే ఇరవై కోట్లు రాలేదేనన్న బాధ. ఇరవై కోట్లు వచ్చాక ఇక అసలు కథ మొదలవుతుంది. వంద కోట్లు ఎలా సంపాదించాలి? ఇదీ మానవ బలహీనత. ఎవరైనా సరే. ఎంతటి వారైనా సరే కాసులకు దాసోహం అనక తప్పదు. ఈ సమాజం అంతే. డబ్బులేనిదే ఏదీ నడవని పరిస్థితి. రోజుకు తినేది కొన్ని ముద్దలయినా కోట్లాది రూపాయలు సంపాదించాలన్న పట్టుదల చాలా మందిలో కనిపిస్తుంది. అది దురాశ అని కొందరు అంటున్నా.. మరికొందరి విషయంలో మాత్రం అది వేరే రకంగా ఉంటుంది. తినతినగ వేమ తియ్యగుండు తరహాలో... డబ్బులు వచ్చే పడే కొద్దీ చేదుగా మారుతుందేమో. అదే జరిగింది. అచ్చం శ్రీధర్ వెంబు విషయంలో.

కోట్ల ఆస్తిని కాదనుకుని...
ఒకటి కాదు.. రెండు కాదు పద్దెనిమిది వేల కోట్ల ఆస్తులు. అమెరికాలో ఆషామాషీ జీవితం కాదు. లగ్జరీ కార్లు. విల్లాలు.. నక్షత్రాల హోటళ్లలో భోజనాలు ఇలా సాగిపోయే శ్రీధర్ వెంబు జీవితంలో భారీ మార్పు చోటు చేసుకుంది. ఆయన ఆస్తి పద్దెనిమిది వేల కోట్లకు చేరుకున్న తర్వాత ఆయనకు డబ్బంటే చేదు పుట్టింది. డబ్బు మానసిక ప్రశాంతతను ఇవ్వదని గుర్తించిన శ్రీధర్ తన సొంత ఊరికి ఏదో చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా వచ్చేశారు. పద్దెనిమిది వేల కోట్ల ఆస్తులను కాదనుకుని ఆయన సమాజం వైపు చూశారు. సమాజంలో ఉన్న రుగ్మతలకు తాను కొంచెమైనా మందు పూయాలన్న శ్రీధర్ వెంబు ఆలోచన కార్యరూపం దాల్చింది.

చిన్న వయసులో...
శ్రీధర్ వెంబు వయసు 53 సంవత్సరాల వయసే. పెద్ద వయస్సేమీ కాదు. అనుభవించే టైం ఇంకా చాలా ఉంది. కానీ కరెన్సీ నోటుపై వెగటు పుట్టింది. ఐఐటీ మద్రాస్ లో చదివి అమెరికా వెళ్లిన ఆయన లెక్కకు మించి సంపాదించాడు. సిలికాన్ వ్యాలీలో జోహో కార్పొరేషన్ సంస్థను స్థాపించి వేల కోట్లు సంపాదించాడు. ఇంకా జీవితంలో ఏదో వెలితి. నిద్రలోనూ అదే కలత. ఏదో ఒకటి చేయాలి? ఏం చేయాలి? అనుకునే సమయంలో మెరుపులాంటి ఆలోచన. వెంటనేఅమెరికాను వదిలేసి తన పుట్టని ఊరు తమిళనాడులోని మాథాలంపరైకి వచ్చేశారు. అక్కడే సామాన్య జీవితం గడపాలని నిర్ణయించుకున్నారు. లుంగీ, సాధారణమైన చొక్కాతో సైకిల్ పై తిరగడంలో ఎంతో హాయి ఉందని గ్రహించాడు. పల్లెటూరి వాతావరణంలో సంపూర్ణ ఆరోగ్యంగా జీవించవచ్చని గ్రహించాడు. అంతటితో ఆగలేదు. తొలుత ఇద్దరు, ముగ్గురు పేదపిల్లలను చేరదీసి విద్య చెప్పడం ప్రారంభించాడు.

సొంత ఊరికి...
పేదపిల్లలను ఉన్నత చదివించాలని చిన్నగా ప్రారంభించిన పాఠశాలలో నేడు 25 మంది విద్యార్థులు చేరారు. నలుగురు ఉపాధ్యాయులను నియమించుకున్నారు. పిల్లలందరికీ ఉచితం ఆహారం అందిస్తారు. దీంతో పాటు కొత్తగా ఎడ్యుకేషన్ స్టార్టప్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. కొన్నేళ్లలో ఈ స్టార్టప్ ద్వారా ఎనిమిది వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని శ్రీధర్ వెంబు భావిస్తున్నారు. పేదపిల్లలకు ఉచితంగా విద్యను అందించడంతో పాటు అత్యాధునిక వసతులతో హాస్టల్స్ నిర్మించాలని శ్రీధర్ వెంబు లక్ష్యంగా పెట్టుకున్నారు. తర్వాత పుట్టిన ఊరికి సాగునీటి సౌకర్యం కల్పించాలన్న పట్టుదలతో కూడా ఉన్నారు. శ్రీధర్ వెంబు లాంటి వాళ్లు అరుదుగా కనిపిస్తారు. సమాజానికి వారి చేస్తున్న మేలు భవిష్యత్ తరాలకు అండగా నిలుస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు.


Tags:    

Similar News