విద్యార్థులకు గుడ్ న్యూస్.. వేసవి సెలవులు పొడిగింపు
ఎండల తీవ్రత ఇంకా తగ్గకపోవడంతో.. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా మరో ఆరు రోజులపాటు సెలవులను పొడిగిస్తున్నట్లు ..
ఈ ఏడాది వేసవికాలంలో భానుడు తన ఉగ్రరూపాన్ని చూపిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు ఏకంగా 45-47 డిగ్రీల వరకూ నమోదయ్యాయి. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో 40-42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు వేసవి సెలవులు పొడిగిస్తారని రెండ్రోజులుగా వార్తలొస్తున్నాయి. ఊహించినట్టే పాఠశాలల విద్యార్థులకు వేసవి సెలవులను పొడిగించారు. కానీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం కాదు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో వేసవి సెలవులను పొడింగించింది అక్కడి విద్యాశాఖ.
వాస్తవానికి జూన్ 1వ తేదీ నుంచి పుదుచ్చేరిలో పాఠశాలలో పునః ప్రారంభం కావలసి ఉంది. కానీ.. ఎండల తీవ్రత ఇంకా తగ్గకపోవడంతో.. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా మరో ఆరు రోజులపాటు సెలవులను పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నమశ్శివాయం ప్రకటించారు. దీంతో జూన్ 7వ తేదీ నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. పుదుచ్చేరిలో ఉన్న 127 ప్రభుత్వ స్కూళ్లల్లో సీబీఎస్ఈ సిలబస్ అమలు చేసేందుకు అనుమతులు లభించాయని మంత్రి పేర్కొన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లోనూ సీబీఎస్ఐ సిలబస్ అమలయ్యేరా చర్యలు తీసుకుంటామన్నారు. సీబీఎస్‌ఈ పాఠ్యపుస్తకాలను.. స్కూల్స్ రీ-ఓపెన్ జరిగిన రోజే విద్యార్ధులకు అందజేస్తామన్నారు. ఇప్పటికే విద్యార్థులకు ఉచిత యూనిఫారం, సైకిళ్ల పంపిణీ జరిగిందన్నారు. మరో నెలలో ల్యాప్‌ట్యాప్‌లు కూడా పంపిణీ చేస్తామని వెల్లడించారు.
ఏపీలో నేటి నుండి ఇంటర్ కాలేజీలు పునః ప్రారంభమయ్యాయి. జూన్ 12 నుండి పాఠశాలలు కూడా పునః ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి జూన్ 10వ తేదీ వరకూ రాష్ట్రంలో టెన్త్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.