స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత లేదు
ఈ విషయాన్ని న్యాయస్థానం నిర్ణయించదని.. సేమ్ సెక్స్ మ్యారేజ్ లకు గుర్తింపు, చట్టబద్ధత కల్పించే అధికారం పార్లమెంట్
స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పించలేమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని న్యాయస్థానం నిర్ణయించదని.. సేమ్ సెక్స్ మ్యారేజ్ లకు గుర్తింపు, చట్టబద్ధత కల్పించే అధికారం పార్లమెంట్ దేనని స్పష్టతనిచ్చింది. ఈ విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఇందుకోసం ఓ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. కోర్టులు చట్టాలను రూపొందించవని, కానీ వాటిని అర్థం చేసుకుని అమలు చేస్తాయని సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు. వివాహ వ్యవస్థ స్థిరమైనదని, దాన్ని మార్చలేమని అనుకోవడం సరికాదన్నారు. స్వలింగ సంపర్కుల కోసం ప్రత్యేక వివాహ చట్టాన్ని తీసుకురాకపోతే మనం స్వాతంత్ర్యానికి ముందు రోజులకు వెళ్లినట్లేనన్నారు. స్వలింగ సంపర్కుల బంధాలపై వివక్ష చూపకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సీజేఐ డీవై చంద్రచూడ్ సూచించారు. ఇలాంటి వివాహాలు చేసుకున్న జంటలకు రేషన్ కార్డులు, పెన్షన్, గ్రాట్యుటీలతో పాటు వారసత్వ హక్కులు కల్పించే విషయాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. ఈ విషయంలో ఎదురయ్యే ఇతరత్రా సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలను గుర్తించేందుకు కేబినెట్ సెక్రెటరీ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.