అంతర్జాతీయ క్రికెట్ కు హర్భజన్ వీడ్కోలు.. ఎమోషనల్ ట్వీట్ !
టీమిండియా క్రికెటర్, ఆఫ్ స్పిన్నర్ అయిన హర్భజన్ సింగ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కు హర్భజన్ వీడ్కోలు పలికారు.
టీమిండియా క్రికెటర్, ఆఫ్ స్పిన్నర్ అయిన హర్భజన్ సింగ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కు హర్భజన్ వీడ్కోలు పలికారు. అంతర్జాతీయంగా క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ మేరకు అధికారికంగా.. తన ట్విట్టర్ వేదికగా ప్రకటన చేశారు. ఎమోషనల్ భజ్జీ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. తన 23 సంవత్సరాల క్రికెట్ కెరీర్ లో తనకు సహకరిస్తూ.. సపోర్ట్ చేస్తూ అండగా నిలిచిన ప్రతిఒక్కరికీ మనస్ఫూర్తిగా స్పెషల్ థాంక్స్ చెప్పారు హర్భజన్.
ఎమోషనల్ ట్వీట్
" ఎన్నో మంచి అవకాశాలు నాకు వచ్చాయి. ఈ రోజు నేను జీవితంలో నాకు అన్నింటినీ అందించిన ఆటకు వీడ్కోలు పలుకుతున్నాను. ఈ 23 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని అందంగా మరియు చిరస్మరణీయంగా మార్చిన ప్రతి ఒక్కరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా కెరీర్ నాకు సహకరించిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు " అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. కాగా.. భజ్జీ ఇప్పటి వరకూ టీమిండియా తరపున 367 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడి.. 711 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు.
ఐపీఎల్ కు కూడా దూరమయ్యాడా ?
కేవలం బౌలింగ్ లోనే కాకుండా.. బ్యాటింగ్ లో సైతం రాణించగల సత్తా ఉన్న భజ్జీ.. తన క్రికెట్ కెరీర్ లో రెండు టెస్ట్ సెంచరీలను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియా తో పాటు ఐపీఎల్ టోర్నీలో చెన్నై, కోల్కత్తా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ జట్టు తరఫున ఆడాడు. ఇదిలా ఉండగా.. అంతర్జాతీయ మ్యాచ్ లకు రిటైర్మెంట్ ప్రకటించిన భజ్జీ.. ఐపీఎల్ మ్యాచ్ లకు కూడా వీడ్కోలు పలికినట్లేనా ? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు హర్భజన్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ విషయంపై భజ్జీ స్పందిస్తే తప్ప.. క్లారిటీ వచ్చే అవకాశం లేదు.