Railway Track: 70 కేజీల సిమెంట్ బ్లాక్ లను పట్టాలపై పెట్టారు
రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో గుర్తుతెలియని దుండగులు
రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో గుర్తుతెలియని దుండగులు రైలు ట్రాక్‌పై 70 కిలోల బరువున్న రెండు సిమెంట్ దిమ్మెలను ఉంచి గూడ్స్ రైలు పట్టాలు తప్పేందుకు ప్రయత్నించారు. సిమెంట్ దిమ్మెలను ఢీకొన్నప్పటికీ, రైలుకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆదివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై రైల్వే ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రాక్ పై సిమెంట్ దిమ్మె ఉంచినట్లు అధికారులకు సమాచారం రాగా.. వెళ్లి ఘటనాస్థలిని పరిశీలించారు. అక్కడ దిమ్మె విరిగిపోయి కనిపించింది. అదే ట్రాక్ మీద కొంత దూరంలో కూడా రెండవ సిమెంట్ బ్లాక్ కనుగొన్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఇటీవలి కాలంలో పలు ప్రాంతాల్లో రైళ్లను పట్టాలను తప్పించే ప్రయత్నాలు జరిగాయి. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో రైల్వే ట్రాక్‌లపై ఎల్‌పిజి సిలిండర్‌ను ఉంచారు. ఓ ప్యాసింజర్ రైలు ఆ సిలిండర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ ఏమీ అవ్వకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాగ్‌రాజ్ నుంచి హర్యానాలోని భివానీకి వెళ్తున్న కాళింది ఎక్స్‌ప్రెస్ కాన్పూర్‌లోని శివరాజ్‌పూర్ ప్రాంతం గుండా వెళుతుండగా ఈ ఘటన జరిగింది. లోకోమోటివ్ పైలట్ ట్రాక్‌లపై ఎల్‌పిజి సిలిండర్, ఇతర అనుమానాస్పద వస్తువులను గుర్తించి వెంటనే బ్రేక్‌లు వేశాడు. అయినప్పటికీ రైలు ఆగిపోయే ముందు సిలిండర్‌ను ఢీకొట్టింది. ఘటన తర్వాత కాన్పూర్ పోలీస్, యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS) సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ఎల్‌పిజి సిలిండర్‌తో పాటు పెట్రోల్ బాటిల్, పేలుడు పదార్థాలు, అగ్గిపెట్టెలను స్వాధీనం చేసుకున్నారు.