Floods : వరదలతో భయానక పరిస్ఠితి...రహదారులు మూసివేత
ఉత్తరాఖండ్ లో వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి
ఉత్తరాఖండ్ లో వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లు నీటమునిగాయి. అలకనంద నది ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఆస్తి నష్టం భారీగా ఉంటుందని అంచనాలు వినపడుతున్నాయి. అల్మోరా, పిథోర్‌గడ్, ఉథమ్‌సింగ్ నగర్, కుమాన్ ప్రాంతాల్లో వారం రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే డెహ్రాడూన్, తేహ్రి, హరిద్వార్ నదీ పరివాహక ప్రాంతాల్లో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.అనేక నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అలకానంద, గంగా, శారద, మందాకిని, కోసి నదులు ప్రవహిస్తుండంతో దాదాపు వందకు పైగా రహదారులను మూసివేశారు.
స్కూళ్లకు సెలవులు...
నైనిటాల్,పౌడీ జిల్లాల్లో భారీ వర్షాల దెబ్బకు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. గంగ, సరయూ నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో అనేక కార్లు, వాహనాలు నీటిలో కొట్టుకుపోయే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరో వారం రోజులు ఇలాగే వర్షాలు కురిస్తే ఎంత నష్టం జరుగుతుందో చెప్పలేమని, అయితే ఎలాంటి విపత్తునైనా తట్టుకునేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ అధికారులకు, సిబ్బందికి సెలవులను ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పటి వరకూ భారీవర్షాల కారణంగా ఇద్దరు మరణించారని అధికార వర్గాలు చెబుతున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం ఖాళీ చేయిస్తుంది.